Sadhguru

శ్రీపాద శ్రీవల్లభులు

శ్రీ దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. వారి అవతారాల్లో ప్రథమావతారమే శ్రీపాద శ్రీవల్లభులు. అంతటి విశిష్టమైన ఈ ప్రథమావతారానికి మన తెలుగునేల శ్రీ పీఠికారపుర క్షేత్రం (నేటి పిఠాపురం) జన్మస్థలం కావడం అత్యంత అద్భుతం. 1320లో (14వ శతాబ్దం) శ్రీపాద శ్రీవల్లభుడు అవతరించారు. దత్తాత్రేయుడి ద్వితీయ అవతారంగా 19వ శతాబ్దంలో కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా గానుగాపురంలో శ్రీ నరసింహ సరస్వతి అవతరించారు. దత్తాత్రేయుడి అవతారాల్లో ఈ రెండూ విశిష్టమైనవి. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, శ్రీపాద శ్రీవల్లభుడు తమ సంకల్పానుసారం తన అవతారం మొదలు 33 తరాలు వచ్చేవరకు తన మహిమలు, వైశిష్ట్యాన్ని గుప్తంగా ఉంచదలచారు.

వీరి జన్మభూమి శ్రీ క్షేత్ర పీఠికాపురం కాగా, వీరి కర్మభూమి మాత్రం కర్నాటకలోకి రాయచూర్ జిల్లాలోని కురుగడ్డ. శ్రీ స్వామివారు కురుగడ్డలోనే అనేక మహిమలు చూపడంతో పాటు తపస్సును కూడా ఆచరించారు. అయితే శ్రీపాద శ్రీవల్లభుల వారి తరువాత చాలా కాలానికి (ఇప్పటి తరానికి దగ్గరలో) 19వ శతాబ్దంలో అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి అవతారం అనేక లీలలు ప్రదర్శించి, మానవులు సదాచార ధర్మాలు ఆచరించేలా, సత్కర్మలను ఆచరించేలా, సుజ్ఞానులుగా మారేందుకు దోహదపడ్డారు. ఇప్పుడున్న తరానికి, శ్రీ నరసింహ సరస్వతి తరానికి మధ్య రెండు మూడు తరాలు మాత్రమే అంతరం ఉండటంతో ఆయన గురించి అందరిలో ప్రచారం జరిగింది. అయితే శ్రీపాద శ్రీవల్లభుడి కాలానికి, ప్రస్తుత తరానికి మధ్య సుమారు 30 తరాల అంతరం ఉండటంతో ఆయనను సేవించుకునే మార్గం తెలియని పరిస్థితి ఏర్పడింది.

అయితే ఎవరి ప్రమేయం లేకుండా శ్రీపాద శ్రీవల్లభుల సంకల్పానుసారంగా పిఠాపురంలో ఆయన పాదుకల ప్రతిష్ఠ, ఆయన పేరున ఆలయ సంస్థానాలు ఏర్పాటయ్యాయి. సంస్థానం ఏర్పడిన కొన్ని సంవత్సరాలకే ఆ ప్రదేశమే ఆయన ‘జన్మస్థానం’ అని తెలియజేసే ‘శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం’ అనే పవిత్ర గ్రంథం తెలుగులో వెలుగులోకి వచ్చింది. ఈ గ్రంథాన్ని పారాయణం చేసి, దాని ఫలితాన్ని పొందుతున్న అనేకమంది భక్తులు శ్రీపాద శ్రీవల్లభులను దర్శించుకునేందుకు ఈ క్షేత్రానికి తరలివస్తున్నారు. ఈ గ్రంథ వైశిష్ట్యాన్ని తెలుసుకున్న భక్తులు దేశం నలుమూలలా వారి వారి భాషల్లో ముద్రించి, తమ శ్రేయోభిలాషులకు అందజేసి పునీతులవుతున్నారు.

శ్రీపాద వల్లభుల తండ్రిగారి జన్మస్థలం అయినవిల్లి!

శ్రీపాద శ్రీవల్లభుడి అవతారానికి సంబంధించి మరొక ఆశ్చర్యకరమైన విశేషం ఉంది. శ్రీవల్లభుడి తండ్రిగారైన శ్రీపాద అప్పల నరసింహ రాజశర్మ గారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి గ్రామం. వీరు వేద విద్యలను అభ్యసించేందుకు పిఠాపురంలో ఉంటున్న గండికోట బాపన్న అవధానుల వద్దకు అయినవిల్లి నుండి వలస వచ్చారు. అప్పల నరసింహ రాజశర్మను బాపన్న అవధానులు తమ చెంతనే ఉంచుకుని, వేద విద్యలను నేర్పెడివారు. దైవ వాక్కును అనుసరించి బాపన్న అవధానులు తమ కుమార్తె అయిన సుమతీ మాతను అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మకు ఇచ్చి వివాహం జరిపించారు. లక్ష్మీనరసింహరాజ శర్మ, సుమతి దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం! వీరిలో ప్రథమ కుమారుడు అంధుడు, ద్వితీయ కుమారుడు మూగవాడు కాగా, మూడో కుమారుడిగా శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించారు.

శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురంలో తల్లిదండ్రుల వద్దే ఉంటూ అద్భుతమైన లీలలు, మహిమలను ప్రదర్శించేవారు. 16 సంవత్సరాల వయసులో లోక కళ్యాణార్ధం శ్రీవల్లభులు దేశాటనకు బయలుదేరి వెళ్ళారు. మూడు పదుల వయసు వరకు తన కురుగడ్డ రాయచూర్లో తపస్సు చేసుకుంటూ అనేక లీలలు, మహిమలు ప్రదర్శించారు. తరువాత శ్రీశైలం వెళ్ళి శ్రీ మల్లిఖార్జునస్వామి లింగానికి శక్తిపాతం జరిపారని, తర్వాత కదళి వనంలో సుమారు 300 సంవత్సరాలు గుప్తంగా ఉన్నారని, ఆ తరువాతే, తన రెండవ అవతారం గానుగాపురం నందు శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించి, తమ పాదస్పర్శతో ఆ క్షేత్రాన్ని పునీతం గావించారు.

భారతావనిలో ఒక విశిష్టమైన దత్తక్షేత్రంగా నాటి నుండి నేటి వరకు గానుగాపురంలో అనేక అద్భుతాలు చూపిస్తున్నారు. పిఠాపురంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి గుడి వీధిలో శ్రీ సజ్జనగడ రామస్వామి వారు కేవలం యాధృచ్చింగానే ఔదుంబ వృక్షం నాటి, శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకలను ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంగా ఏర్పడింది. విచిత్రంగా అదే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలం (తాత బాపన్న అవధానుల గృహం) అని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ద్వారా వెల్లడయ్యింది. ఇదంతా శ్రీవల్లభుల వారి అనుగ్రహమేనని భక్తులు చెబుతున్నారు.
తండ్రిని కరణీకం చేయవద్దన్న శ్రీవల్లభుడు.

శ్రీపాద శ్రీవల్లభుడి తాతగారు తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లిలో కరణంగా పనిచేశారు. ఆ రోజుల్లో కరణీకం చేసిన వారి పేరు చివరన రాజా అని ఉండేది. ఆ విధంగా కరణంగారి కుమారుడిని అప్పల లక్ష్మీ నరసింహ రాజశర్మ అనేవారు. తండ్రి అనంతరం అప్పల లక్ష్మీనరసింహరాజ శర్మ కరణంగా బాధ్యతలు తీసుకోవల్సి రాగా ఆయన కుమారుడైన శ్రీపాద శ్రీవల్లభుల వారు వారించారట. ‘నేను ఈ విశ్వానికి అధిపతిని. కాబట్టి తన తండ్రి ఈ విశ్వానికి అధిపతియైన శ్రీపాద శ్రీవల్లభుడికి తండ్రి’ అనే పేరు మాత్రమే రావాలని శ్రీపాద శ్రీవల్లభుడు భావించారు. ఇది చరితామృత గ్రంథమందు తెలియజేయబడింది. ఈ విధంగా తన తండ్రి కరణీకం చేసేందుకు శ్రీవల్లభులు అంగీకరించలేదని తెలుస్తోంది.
వెలుగు చూసిన వాస్తవం
బెంగుళూరుకు చెందిన శ్రీ దేవదాయ కులకర్ణి దత్తాత్రేయ ఉపాసకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన పిఠాపురం పట్టణానికి విచ్చేసి గురు చరిత్రలో పేర్కొన్న శ్రీపాదుల వారి ఆలయం కోసం ఆరా తీశారు. ఇక్కడ ప్రత్యేకంగా శ్రీపాదులవారి దేవస్థానం లేదని తెలిసి ఆయన తీవ్ర విస్మయానికి లోనయ్యారు. పాదగయ క్షేత్రంలో దత్తాత్రేయుల వారు ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభుని రూపంలో అవతరించిన పవిత్ర భూమి పిఠాపురం అని, ఈ విషయం గురు చరిత్రయందు స్పష్టీకరించబడిందని కులకర్ణి స్థానిక పెద్దలకు వివరించారు. ఇక్కడ ప్రత్యేకంగా శ్రీపాదుల వారి దేవస్థానమేదీ లేదని, పాదగయ క్షేత్రంలో దత్తాత్రేయుల వారి ఆలయం మాత్రం ఉందని పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్య శాస్ర్తీ ఆ ఆలయాన్ని కులకర్ణికి చూపారు. ఆలయ స్థితిగతులను చూసిన ఆవేదన చెంది బెంగుళూరుకు చేరుకున్న అనంతరం దత్తావధూతయైన భగవాన్ శ్రీ్ధరస్వామి శిష్యులైన సద్గురు సజ్జనగడ రామస్వామికి వివరించి ఆవేదన చెందారు. దీంతో రామస్వామి శ్రీమతి కమలమ్మగారితో కలసి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తొలిసారిగా 1966లో శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానమైన పిఠాపురం చేరుకున్నారు.

కుక్కుటేశ్వరస్వామి వారి పవిత్ర పాదగయ క్షేత్రంలో రామస్వామి స్నానమాచరిస్తున్న సమయంలో దత్తాత్రేయులవారు దిగంబరుడుగా బాలక రూపంలో దర్శనమిచ్చారు. అప్పటి నుండి రామస్వామి పిఠాపురంతో అనుబంధం పెంచుకుని పైండా రామారావు అధ్యక్షుడిగా శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం అనే సంస్థను స్థాపించారు.

ఔదుంబర వృక్షాన్ని నాటిన స్థలానికి దగ్గరలో శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకలను స్థాపించారు. ఈ ఆలయంలో మధ్యలో మూల స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుల వారిని, వారి కుడి భాగంలో వారి ప్రథమావతారులైన శ్రీ శ్రీపాద శ్రీ వల్లభుల వారిని, ఎడమ భాగంలో వారి ద్వితీయ అవతారులైన శ్రీ నృసింహ సరస్వతుల వారిని ప్రతిష్ఠించారు. మిక్కిలి మహిమాన్వితులైన ఇటువంటి ముమ్మూర్తుల దర్శనం ఏకకాలంలోనే ప్రాప్తించే ఏకైక దత్తక్షేత్రం ఇదే కావడం విశేషం! విశిష్టమైన చరిత్ర కలిగిన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం సద్గురు రామస్వామి కృషి ఫలితంగా ఆవిర్భవించి నేడు దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

2050 నాటికి మహా క్షేత్రంగా పిఠాపురం

శ్రీపాద శ్రీవల్లభుల వారే తమ సంకల్పానుసారం తన నుండి 33వ తరం వచ్చిన తరువాత శ్రీ పీఠికాపురం మహా పుణ్యక్షేత్రం అవుతుందని చెప్పారు. అంతవరకు వారి మహిమలు, వైశిష్ట్యాన్ని గుప్తంగానే ఉంచుకోదలచారు. ఈ విధంగా చూస్తే 2050వ సంవత్సరానికి పీఠికాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం మహా క్షేత్రంగా తీర్చిదిద్దుకోనుందని భక్తులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న భక్తుల్లో అధిక 90 శాతం భక్తులు మహారాష్ట్ర, గుజరాత్ల నుండి, తెలంగాణలోని హైదరాబాద్ నుండి వస్తున్నారని, మిగిలిన 10 శాతం భక్తులు ఇతర ప్రాంతాల నుండి వస్తున్నట్టు తెలిపారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *