సాయిబాబా సొంతూరు.. షిర్డీనా? పాథ్రీనా?
ఏరుల పుట్టుక, యోగుల పుట్టుక ఎవరికీ తెలియదని పెద్దవాళ్లు అంటుంటారు. ఏరయినా, యోగయినా మానవ జీవనానికి ఎంతో ముఖ్యం. మనిషి దైనందిన అవసరాలను తీర్చే జీవశక్తి ఏరు అయితే, మనిషి నడవడికి దారి చూపించే యోగి మార్గదర్శి. అయితే, ప్రస్తుతం కోట్లాది మందికి దైవంగా మారిన షిర్డీ సాయిబాబా ఎక్కడ పుట్టాడన్న అంశం తెరమీదకి వచ్చింది. దేశమంతా పెద్ద వివాదంగా మారింది. సాయిబాబా పుట్టిన ఊరు పాథ్రీగా గుర్తింపు ఇవ్వకూడదని, దానికి ఎలాంటి ఆధారం లేదని షిర్డీ వాసులు అంటున్నారు.
సుమారుగా వందేళ్ల క్రితం ఈ నేల మీద నడిచిన అవధూత సాయిబాబా. ఆయన దత్తాత్రేయుని అయిదో అవతారంగా జనం నమ్ముతున్నారు. ఏరుల పుట్టుక తెలియనట్లే… మహా యోగి అయిన సాయిబాబా పుట్టుక గురించికూడా ఇంతకాలం ఎవరికీ తెలియదు. బాబా 16 ఏళ్ల వయసులో (1854లో) మొదటిసారిగా షిర్డీ వచ్చారని ‘సాయి సచ్చరిత్ర’లో రాసి ఉంది. బాబాతో సన్నిహితంగా తిరిగిన అన్నాసాహెబ్ ధాబోల్కర్ (హేమాండ్పంత్) రాసిన ఈ పుస్తకాన్ని స్వయంగా బాబా బయోగ్రఫీగా భక్తులు భావించి, నిత్యం పారాయణ చేస్తుంటారు. రెండోసారి 1858లో 20 ఏళ్లప్పుడు ఒక పెళ్లి బృందంతో కలిసి షిర్డీ వచ్చి ఇక వెళ్లలేదని, ఖండోబా మందిరం దగ్గరే స్థిరపడిపోయారని చెబుతారు.
‘తారీఖులు, కైఫియత్లు కాదోయ్ చరిత్రంటే’ అన్నట్లుగా సాయిబాబాని మనసా వాచా నమ్మేవారికి ఇన్ని వివరాలతో నిమిత్తం లేదు. బాబా భౌతికంగా 1918లో దూరమైనా… ఆయన సమాధిని దర్శించుకుని భక్తులు సంతృప్తి చెందుతుంటారు. బాబా చెప్పిన 10 మాటల ప్రకారం ‘ఆయన సమాధే భక్తులను దీవిస్తుంది. అక్కడి నుంచే దర్శనమిస్తారు, మాట్లాడతారు’. ఈ నమ్మకాన్ని ఎవరు అవునన్నా కాదన్నా భక్తులకు మాత్రం శిలాశాసనం. ఇప్పుడు తలెత్తిన కొత్త వివాదమేమిటంటే, సాయిబాబా షిర్డీకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాథ్రీ అనే ఊరిలో జన్మించారన్నది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. షిర్డీ కర్మభూమిగా, పాథ్రీ జన్మభూమిగా ప్రకటించారు.
ఇందులో వివాదం దేనికని అనుకోవచ్చు. ఈ రోజున క్షేత్ర దర్శనమనేది కోట్లాది రూపాయల టూరిజం ఇండస్ట్రీతో ముడిపడింది. షిర్డీగల అహ్మద్నగర్ జిల్లాకి, పాథ్రీ ఉన్న పర్భణి జిల్లాకి ట్రెడిషనల్ వార్ ఎప్పట్నుంచో సాగుతోంది. మహారాష్ట్రలో బాగా వెనుకబడిన ప్రాంతాల్లో పర్భనీకూడా ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. రాష్ట్రాల రీ ఆర్గనైజేషన్ సమయంలో ఇది మొదట బొంబాయి స్టేట్లోనూ, ఆ తర్వాత మహారాష్ట్రలోనూ చేరింది. అయితే, అహ్మద్నగర్ మాదిరిగా సంపన్నమైనది కాదు. అహ్మద్నగర్ వెనకబడిన జిల్లాలో ఒకటిగా కేంద్రం గుర్తించి ప్రత్యేక నిధులు అందిస్తున్నప్పటికీ… ఈ ప్రాంతం సహకార రంగంలో బాగా ఎదిగింది. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువ. దేశంలో చక్రం తిప్పుతున్న షుగర్ లాబీల్లో ఇదొకటిగా చెబుతారు.
పాథ్రీ ప్రాంతాన్నికూడా షిర్డీతో సమంగా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అనడంతో… షిర్డీలో పొలిటికల్ కుదుపు ఏర్పడింది. అక్కడ ఆర్థికంగా బలమైన వర్గాలన్నీ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ని సపోర్ట్ చేస్తున్నాయి. మాజీ మెంబర్ కైలాస్బాపు కోటేకూడా సీఎం నిర్ణయంపై అభ్యంతరం చెప్పారు. ‘సాయిబాబా తన జీవిత కాలంలో ఎప్పుడూ తన బాల్యం గురించిగానీ, తాను పుట్టిన ఊరు గురించి గానీ చెప్పలేదు. ఆ విషయాలేవీ ఆయన సచ్చరిత్రలో లేవు. ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. మరి, ఏ విధంగా పాథ్రీనే సాయిబాబా జన్మస్థలంగా ముఖ్యమంత్రి నిర్ధారిస్తున్నారు. సీఎంని వివరణ అడుగుతాం’ అన్నారు.
ఈ ఒపీనియన్స్తో తమకు ఏమీ సంబంధం లేదంటున్నారు భక్తులు. సాయిబాబా తన సమాధి నుంచే భక్తుల సమస్యలకు సమాధానమిస్తామని చెప్పారన్నది వాళ్ల అభిప్రాయం. ఆసక్తిగలవాళ్లు షిర్డీ సాయి జన్మస్థలాన్ని చూడాలనుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదని అంటున్నారు. దీనికికూడా షిర్డీ సాయినాథుడే సమాధానమిస్తాడని భక్తులు నమ్మకంతో చెబుతున్నారు.
ఇంతకీ పాథ్రీ ప్రత్యేకత ఏమిటి?
ఇన్నాళ్లూ పాథ్రీ క్రికెట్ ప్లేయర్లకు చాలా ఇష్టమైన ఊరు. లోకల్ టాలెంట్ని గుర్తించడంకోసం ఏటా పాథ్రీ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) నిర్వహించేవారు. ఇప్పుడీ ఊరు సాయి భక్తులకు ఎంతో ముఖ్యమైనదిగా మారిపోయింది. శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయాన్ని దర్శించడానికి రోజూ వేలాదిమంది వస్తున్నారు. నిజానికిది పర్భణి జిల్లాలో చాలా చిన్న ఊరు. సాయిబాబా ఇక్కడే జన్మించారని, 16 ఏళ్ల వయసులో షిర్డీకి వెళ్లారని జనాల నమ్మకం.
సాయి జన్మస్థానంగా ఈ ఊళ్లోని ఒక ఇంటిని 1970ల్లో గుర్తించారు. ఫీల్డ్ రీసెర్చ్ జరిపిన మీదట ఈ నిర్ధారణకు వచ్చారు. ఆ ఇంటిని డెవలప్ చేయడంకోసం శ్రీ సాయి స్మారక సమితి ఏర్పడింది. 1994లో ఆలయ నిర్మాణం మొదలెట్టింది. ఆ ఇంటిని కూల్చి కొత్తగా గుడి కడదామనుకున్నప్పుడు అనేక వస్తువులు దొరికాయి. వాటన్నింటినీ సాయిబాబా తన బాల్యంలో ఉపయోగించినవి భావించి జాగ్రత్త చేశారు. ఆలయం 1999లో పూర్తవడంతో భక్తులకు అదికూడా యాత్రా స్థలమైంది.
బిజినెస్ పోతుందన్న భయమా..?
షిర్డీ రోజూ కోట్లాది రూపాయల రాబడి తెచ్చుకుం టోంది. వచ్చిపోయే భక్తుల సంఖ్య సగటున 60 వేల పైమాటే. రామనవమి, దసరా పండుగల్లో లక్ష మంది వరకు వస్తుంటారు. డైలీ యావరేజ్గా రూ. 2 కోట్ల హుండీ ఆదాయం ఉంటుందని అంచనా. వ్యాపారానికి లెక్క లేదు. ట్రావెలర్స్, హొటల్స్, మెస్లు జనంతో కిటకిటలాడతాయి. ఫొటోలు, దండలు, ప్రసాదాలు అమ్ముడుపోతుం టాయి. ఇప్పుడు షిర్డీతోపాటుగా పాథ్రీని కూడా గుర్తిస్తే… ఊరు ప్రత్యేకత తగ్గడంతోపాటు తమ వ్యాపారం తగ్గుతుందన్న భయం బిజినెస్ సెక్టార్లో ఉందంటున్నారు ఎనలిస్టులు.
హైదరాబాద్కి 400 కి.మీ దూరంలో పాథ్రీ..
హైదరాబాద్కి 400 కిలోమీటర్ల దూరంలో ఔరంగాబాద్ రూట్లో పాథ్రీ ఊరుంది. షిర్డీ మాదిరిగానే పాథ్రీకికూడా నేరుగా రైలు లేదు. అక్కడికి చేరుకోవాలంటే పర్బనీలోగానీ, మన్వాత్ రోడ్డు స్టేషన్లోగానీ దిగాలి. ఈ ఊరికి పర్భణి 46 కిలోమీటర్లు, మన్వాత్ రోడ్డు 15 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పాథ్రీ వెళ్లాల్సి ఉంటుంది. షిర్డీ వెళ్లేవారు సైతం నాగర్సోల్లో దిగి, అక్కడి నుంచి బస్సు లేదా కార్లలో వెళ్తుంటారు. కొత్తగా సాయిబాబా జన్మస్థలం పేరుతో… షిర్డీకి 270 కిలోమీటర్ల దూరంలోని పాథ్రీపట్టణం వెలుగులోకి రావడంతో… షిర్డీ గ్రామస్తులకు చాలా కంగారు మొదలైంది. ఇంతకాలం సాయిబాబాకు ఏకైక కేంద్రంగా షిర్డీయే ఉండేది.
సాయిబాబాని దత్తాత్రేయుడి అయిదో అవతారంగా భక్తులు భావిస్తారు. అత్రి మహర్షి, సతీ అనసూయలకు త్రిమూర్తుల అంశంతో జన్మించినవాడు దత్తాత్రేయుడు. ఆయనను దత్త సంప్రదాయంలో భక్తులు పూజిస్తారు. కలియుగంలో మానవ అంశతో ఆయన అవతారమెత్తాడనికూడా నమ్ముతారు.
శ్రీపాద శ్రీవల్లభుడు: దత్తాత్రేయుని మొదటి మానవ అవతారంగా భక్తుల నమ్మకం. 13వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో శ్రీవల్లభుడు జన్మించారని చెబుతారు. ఆయన పాదగయ క్షేత్రంలోని ఒక రావిచెట్టుకింద తపస్సు చేసుకునేవారని, 16 ఏళ్ల వయసులో కురువాపురం (కర్ణాటక) వెళ్లి అక్కడ కృష్ణా తీరంలోనే ఉండిపోయారని అంటారు. ‘గురు సంప్రదాయం’ శ్రీవల్లభుల నుంచే మొదలైంది.
నృసింహ సరస్వతి: దత్తాత్రేయుడి రెండో అవతారంగా నమ్మకం. నృసింహ సరస్వతి (1378–1459) మహారాష్ట్రలోని కరంజలో జన్మించి, గాణుగాపురం (కర్ణాటక)లో నివసించారని చెబుతారు. ఆయన జీవిత చరిత్రయిన ‘శ్రీగురు చరిత్ర’ పుస్తకాన్ని భక్తులు నిత్యం పారాయణ చేస్తుంటారు.
స్వామి సమర్థ: మూడో అవతారమని చెప్పే స్వామి సమర్థనే అక్కల్కోట మహరాజ్గా భక్తులు పూజిస్తారు. అక్కడే 1878 వరకు నివసించి సమాధిలోకి వెళ్లిపోయారు.
మాణిక్య ప్రభు: దత్తుడి నాలుగో అవతారంగా భావించే మాణిక్య ప్రభు (1817–1865) వేదాంతి, కవిగా ప్రసిద్ధి. కర్ణాటకలోని లదవంతిలో జన్మించి, మాణిక్నగర్లో సమాధి సిద్ధి పొందా రని భక్తుల విశ్వాసం.
షిర్డీ సాయిబాబా: దత్త భక్తులందరూ సాయిని దత్తాత్రేయుడి ఐదో అవతారంగా నమ్ముతూ సందర్శిస్తుంటారు.