మహాయోగి… త్యాగి…శ్రీ మదనానంద సరస్వతి స్వామి
సనాతన వైదిక సంప్రదాయానికి, నైష్ఠిక, ఆధ్యాత్మిక ప్రశాంత జీవనానికి నిలయమైన ‘సదానంద మఠం’ మన పొరుగుననే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బీదరు జిల్లా బసవకళ్యాణ్లో ఉంది. ఈ మఠానికి వేల ఏండ్ల చరిత్ర ఉంది. కాశీ మహానగరంలో సాక్షాత్తుగా పరమశివుని దగ్గరే దీక్ష తీసుకొని దక్షిణాదిలోని కల్యాణి పట్టణానికి వచ్చిన సదానంద సరస్వతీ మహర్షి తమ తపస్సునంతా ధారపోసి ఏర్పరచిందీ మఠం. మహా మహిమాన్విత తపోమూర్తిగా ఎన్నో అద్భుత లీలలను ప్రదర్శించి ఈ మఠంలోనే సజీవ సమాధి పొందిన సదానందుల వారే ఈ పీఠానికి ఆది దైవతములు. వారు నెలకొల్పిన వైదిక ఆచారాలనే తదనంతర పీఠాధిపతులు తూ.చా. తప్పకుండా పాటించి ఈ పీఠ పవిత్రతను ఇనుమడింపజేశారు. సదానంద మఠంలో గర్భాలయానికి దిగువన నేలమాళిగలో శ్రీ సదానంద, రామానంద, పూర్ణానందుల సజీవ సమాధులున్నాయి. ఈనాటికీ సవైదికంగా ఈశ్వరారాధనతో బాటు ఈ సమాధిస్థిత స్వాములకు ప్రతినిత్యం అర్చనలు జరుగుతాయి.
ఇప్పటివరకు 64 మంది యతీంద్రులు పరంపరాగతంగా ఈ మఠానికి పీఠాధిపత్యం వహించారు. 108 మందికి పైగా సన్న్యాసదీక్షలతో ఈ పీఠామ్నాయ విధానాన్ని దేశమంతటా వ్యాపింపజేశారు.
64 మంది పీఠాధిపతుల సమాధులన్నీ ఈ మఠంలోనే ఉండడం, నిత్య పూజలందుకోవడం ఇక్కడి విశిష్టత. ఒక ఐతిహ్యం ప్రకారం శ్రీ రామానందులు (సదానంద సరస్వతీ స్వాముల అంతేవాసి) పాండవుల ముని మనుమడైన జనమేజయుడు సంకల్పించిన సర్పయాగంలో ఋత్విజులకు కలిగిన సందేహాలు నివృత్తి చేశారట. ఇదీ ఈ పీఠం ప్రాచీనత.
సదానంద మఠస్వాములది ఆది దత్త సంప్రదాయం. అవధూత స్వరూపమైన ‘ఆనంద సరస్వతీ’ సంప్రదాయం. అందుకే వారందరి దీక్షా నామధేయాలలో ఆనంద సరస్వతి బిరుదముంటుంది. ఆ పరంపరలో సదానంద మఠానికి 65వ పీఠాధిపతులుగా విరాజిల్లిన సద్గురు యతివర పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ స్వామివారు అపర శివావతారులుగా భాసిల్లారు.
మహాయోగి… త్యాగి… మదనానందస్వామి
వేదకాలం నుంచి భారతీయ భావన ఉదారమైంది, పావనమైంది. మన భారతావనిలో నాటి నుంచి నేటి వరకు పరమహంసల పరమ కరుణా కిరణాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. పారమార్థిక భావాలను పల్లవింపజేస్తూనే ఉన్నాయి. ఈ పరంపరలో భవసాగరమగ్నులైన మానవులను తరింప జేయడానికి పరమకృపాసాగరులై అవతరించిన ఈశ్వరాంశ సంభూతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ మదనానంద యతీశ్వరులు. జ్ఞానసిద్ధులు, త్యాగమయ జీవనులు అయిన స్వామివారు తెలంగాణ మాగాణంలో ఆధ్యాత్మిక కిరణాలను ప్రసరింపజేసి మహాయోగిగా, మహాత్యాగిగా భక్తుల హృదయాల్లో నిలిచారు.
అత్యంత పుణ్యప్రదమైన భారత భూమిలో అన్నపూర్ణగా ప్రసిద్ధిచెందిన తెలంగాణ రాష్ట్రంలోని మేధావులెందరికో జన్మనిచ్చిన మెదక్ జిల్లాలో గల టేకుమాల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ స్వామివారు ఉదయించారు. ‘త్యాగే నైకే అమృతత్వ మానశుః’ అన్న మాటకు అక్షరోదాహరణం శ్రీ స్వామివారి జీవితం.
రావికోటి వంశస్థులు సదాచార పరాయణులు బ్రహ్మశ్రీ నరహరిశర్మ, మహాసాధ్వి సుపుత్రవతి శ్రీమతి లక్ష్మీనర్సమ్మ గారలకు ద్వితీయ పుత్రసంతానంగా శ్రీవారు జన్మించారు. వీరి పూర్వాశ్రమ నామధేయము బ్రహ్మశ్రీ రావికోటి లక్ష్మీనారాయణ శర్మగారు. శ్రీవారి వృత్తాంతం ఆద్యంతం ఉత్కంఠ భరిత త్యాగమయం వీరు జన్మించినది మొదలు ఆ జీవనము ధర్మసముధ్ధరణకు నిరంతర అన్నదానానికి పెట్టింది పేరుగా కీర్తి గడించారు. ఆశ్రితులకు శరణాగతి ప్రసాదించి రక్షించారు. ధనసంపదలో నిరుపేద బ్రాహ్మణ వంశంలో పుట్టిన వీరు తమ సహజ ఔదార్యగుణ సంపదలో కోటీశ్వరులయ్యారు. నిరంతరం శ్రమజీవిగా సత్యవ్రత పరాయణులగా ఆచారవంతులగా శ్రీలక్ష్మీనారాయణశర్మగారు తమ జీవితాన్ని దిద్దుకున్నారు. ‘
కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి’ అనేది వీరి అత్యంత ఆచరణీయ సందేశం. పూర్వాశ్రమంలో శ్రీస్వామివారు వ్యవసాయాన్ని, పురోహితాన్ని చేసేవారు. పెద్ద కుటుంబాన్ని పెద్దతనంతో పోషించారు. వీరు వ్యవసాయం చేసిన సందర్భంలో పండించిన పంట రాశిలో గ్రామంలో అందరికన్నా ఎక్కువగా వీరిదే ఉండేది. మరి ఇంటికి చేరే ధాన్యం మాత్రం అందరికన్నా తక్కువగా ఉండేది. ఇందుకు కారణం వడ్లు నూర్చింది మొదలు వచ్చిన ప్రతివ్యక్తికీ చాటెడు వడ్లన్నా ఇచ్చేవారు. కారణమేమంటే ‘వడ్లు పండించింది తినడానికే కదా’ అని సమాధానం ఇచ్చేవారు. ఎవరికి అవసరమో వారికి ఆ ధాన్యం భగవంతుడు చేరుస్తాడు అని చెప్పేవారు. త్యాగమంటే వాగ్దానం కాదు, ఆచరణాత్మకంగా ఉండాలి అని వీరు చాటి చెప్పారు.
వ్యవహార దక్షత గల స్ఫురద్రూపంతో, సద్యస్ఫూర్తితో మాట్లాడేవారు. ఉర్దూలో చమత్కారంగా మాట్లాడేవారు. ఒకసారి న్యాయస్థానంలో ఉర్దూలో వాదించి తమ వ్యాజ్యాన్ని గెలుపొందిన మేధామూర్తి. న్యాయబద్ధంగా తను గెలుచుకొన్న భూమిని సైతం అదే వ్యక్తికి వెంటనే దానమిచ్చిన ఘనుడు.
వ్యవసాయం చేసిన రోజులలో పండించిన ధాన్యాన్నంతా పంచిపెట్టి పంచె దులుపుకొని పరమానందంగా గూటికి చేరుకొనేవారు. జీవితాన్ని తపస్సుతో గడుపుతూ ఆహార నియమాన్ని అలవరచుకొన్నారు. ఎక్కడికి వెళ్ళినా సైకిలు ప్రయాణం, వెంట బొగ్గుపొయ్యి, చేతాడు, ఒక లోటా, కొంచెం బియ్యం, పప్పు, మొదలైన పదార్థాలు, బిల్వదళాలు, పూజపెట్టె, మడి పంచెలతో ప్రయాణం. సకాలంలో సంధ్యావందనాది కర్మలు చేసేవారు. ఎవరికైనా ఆకలి అవుతున్నట్లు వీరికి తోచినదంటే వంట చేసి అన్నం పెట్టేవారు.
స్వధర్మ పరిపాలనలో సాటిలేని వీరు త్యాగమే ఊపిరిగా జీవితాన్ని మలచుకొన్నారు. 1972వ సంవత్సరంలో సర్వ ప్రాయశ్చిత్తం చేసికొని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ద్వారా బసవకళ్యాణ్ చేరుకొని సదానంద మఠాధీశులైన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారిని చేరి, బ్రహ్మచర్యాశ్రమం నుండి నేరుగా సన్యాసాశ్రమం స్వీకరించి ‘మదనానంద సరస్వతీ స్వామి’ అని యోగపట్టాను పొందారు. సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందే పైతర, టేక్మాలు, కొప్పోలు గ్రామాలలో అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి కొప్పోలులో కొంతకాలం తపస్సు నాచరించి శ్రీ ఉమాసంగమేశ్వర స్వామి దేవాలయాన్ని సముద్ధరణ చేశారు. అనేక రుద్రయాగాలు నిర్వహించారు. మహాక్రతువులు చేశారు. అనేక గ్రామాలు పర్యటించారు.
భగవంతుని ఆదేశం ధర్మపత్రం ద్వారా నిర్ణయించుకొని సిద్ధిపేటకు చేరారు. సదానందాశ్రమాన్ని స్థాపించి విరివిగా గ్రామ పర్యటనలు చేస్తూ భక్తులకు ‘కలౌ పార్థివ లింగ పూజనమ్’ అనే అంశాన్ని విపులీకరిస్తూ పార్థివ లింగాలు చేయించి కోటి లింగాలతో ఉమాపార్థివస్వామి ఆలయ సముదాయాన్ని నిర్మింప జేశారు.
గురువుగారి ఆదేశానుసారం 1990లో బసవకళ్యాణ్లోని సదానంద మఠానికి అధిపతి అయ్యారు. సదానంద మఠాన్ని ఆర్థికంగా అత్యంత పరిపుష్టం చేశారు. ఒకసారి మతసామరస్యం గురించి బసవకళ్యాణ్లో ఏర్పాటు చేసిన మానవీయత మహాసభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఉర్దూలో ప్రవచించి మతమంటే మానవతాపూర్వక జీవన విధానమని, ప్రజలు అనవసరంగా ఆందోళనలతో అలమటించకూడదని, తాము పుట్టిన మతంలోనే సత్యవంతులుగా పేరుపొందాలని ఉద్బోధించారు. ఆనాడు ప్రజలలో ఉట్టిపడ్డ ఆనందాన్ని చూచి తీరాలి. నిజంగా మహనీయుల మాటలకు ఎంత శక్తి ఉంటుందో ప్రస్ఫుటమైంది.
పిడికెడు వేరుశనగ పలుకులే ఆహారంగా వీరు తమ చతుర్థాశ్రమమంతా గడిపారు. వీరు లెక్కలేనన్ని జీర్ణాలయాలను ఉద్ధ్దరించారు. చాలాకాలం నిజాంసాగర్ సమీపంలో గల శ్రీ ఉమాసంగమేశ్వరస్వామి ఆలయం వద్ద ఘోర తపోదీక్షలో గడిపారు. సిద్ధిపేటలో ఉమాపార్థివ కోటి లింగేశ్వర దేవాలయాన్ని, శ్రీ సదానంద ఆశ్రమాన్ని, శ్రీ సదానంద వైదిక పాఠశాలను స్థాపించారు. చుట్టుపక్కలగల గ్రామాలకు తిరిగి ధర్మప్రచారం చేసేవారు. మృత్యుంజయ భజన, అన్నదానం వీరి ప్రత్యేక ప్రచారాలు. మిరుదొడ్డి మండలం నాథులాపూర్, పోచారం, టేక్మాల్, నాగసాని పల్లి, భుజురంపేట మొదలైన ఎన్నో గ్రామాలలో శ్రీ సదానంద ఆశ్రమాలను స్థాపించారు.
బసవ కళ్యాణ్‌లో సదానంద మఠంలో కోటి పార్థివలింగ సహిత ఉమా మేథా దక్షిణామూర్తి, శ్రీ పంచముఖాంజనేయ, నవగ్రహ దేవాలయాలను నిర్మించారు.
శ్రీ స్వామివారు గురువుగారి ఆదేశానుసారం 1990లో శ్రీ సదానంద పీఠానికి 65వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
1995లో అప్పటి కొండపాక మండలంలోని (నేటి తొగుట మండలం) రాంపూర్ గ్రామంలో దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం అనే ఆలయత్రయాన్ని ఏర్పాటు చేయటానికి మదనానంద శారదా క్షేత్రాన్ని ఆవిర్భవింపజేశారు. ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి అధి, ప్రత్యధి, కర్మ సాద్గుణ్య, దశదిక్పాలక సహిత నవగ్రహ మండలి ఆలయం, దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన స్ఫటిక శివలింగాన్ని, శారదా శంకరాచార్యాది దేవతామూర్తులతో కూడిన పెద్ద దేవాలయ సముదాయాన్ని స్థాపించారు.
ఎందరో శిష్యులకు వివిధ ఉపాసనలను ఉపదేశించారు. గృహస్థ శిష్యులే కాకుండా లోక సముద్ధరణకు నలుగురు యతీశ్వరులను కూడా తీర్చిదిద్దారు. తెనాలికి చెందిన శ్రీశ్రీశ్రీ రామానందసరస్వతీ స్వామివారు మొదటి వారు. శ్రీశ్రీశ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వామివారు రెండవవారు (వీరు శ్రీవారి పూర్వాశ్రమంలో, వరుసకు కుమార సమానులైన బ్రహ్మశ్రీ రఘురామశర్మగారు). తరువాత శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామివారు (రాంపురం, తొగుట మండలం, సిద్ధిపేట జిల్లా). భీమగల్‌కు చెందిన శ్రీశ్రీశ్రీ సహజానంద సరస్వతీ స్వామివారు నాల్గవ వారు.
వీరిలో శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామివారి ద్వారా తురీయాశ్రమాన్ని స్వీకరించిన శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు (ప్రస్తుత పీఠాధీశ్వరులు శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠం, రాంపురం) వీరి ప్రశిష్యులై శ్రీ గురుమదనానంద సరస్వతీ సంప్రదాయాన్ని లోకానికి చాటుతున్నారు. ధర్మసముద్ధరణకు పాటుపడుతున్నారు.
శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ స్వామివారు ఆవిర్భావం నుండి నిత్య చైతన్య పరబ్రహ్మ స్థితులుగా మారే వరకు అనునిత్యం అందరి మేలు కొరకు పరితపించిన పరిపూర్ణ పుణ్యమూర్తి. శ్రీ స్వామివారు కాషాయాన్ని ధరించిన కొన్నాళ్లకు కాషాయ వస్త్రాలు సైతం వదిలేసి ‘గోనెపట్ట’నే జీవితాంతం ధరించిన నిరాడంబరులు. స్వామివారు శ్రీ విక్రమ నామ సంవత్సర కార్తిక కృష్ణ ఏకాదశి (21-11-2000) నాడు బ్రహ్మీభూతులైనారు.
శ్రీ స్వామివారు అందించిన ఉపదేశ పంచామృతాలు
• ఎప్పుడూ ఎవ్వరూ దేనికోసం దుఃఖించ వద్దు. నేనెప్పుడూ మీతోనే ఉన్నాను.
• నిత్యం మృత్యుంజయ భజన చేయండి.
• నిరంతరం అన్నదానం చేయండి.
• ఉపదిష్ట మంత్రాన్ని కోట్ల సంఖ్యలో జపించండి.
• పేదలను, దీనులను ప్రేమతో ఆదరించండి. ప్రతి జీవిలో పరమాత్మను దర్శించండి.