ఆరవ అధ్యాయము
శ్రీ సాయి సత్ చరిత్రము
ఆరవ అధ్యాయము
Shri Sai Satcharitra – Chapter 6
ఓం శ్రీ సాయి నాథాయ నమః
శ్రీసాయిబాబా
జీవిత చరిత్రము
ఆరవ అధ్యాయము
శ్రీరామ నవమి ఉత్సవము, మసీదు మరామతు
గురువుగారి కరస్పర్శ ప్రభావము – శ్రీరామనవమి యుత్సవము, దాని ప్రభావము, పరిణామము మొదలగునవి, మసీదు మరామతులు.
గురువుగారి హస్తలాఘవము
సంసారమను సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునపుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును. సద్గురువనగనే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు. నాకండ్లయెదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి యాశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్లనుండి ప్రేమ పొంగి పొరలు చున్నది. గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది. సూక్ష్మశరీరము (కోరికలు, భావముల మయము) అగ్నిచేకూడ కాలనట్టిది. గురువుగారి హస్తము తగులగనే కాలిపోవును; జన్మజన్మల పాపములు పటాపంచలై పోవును. మతవిషయములు భగవద్విషయములనగనే అసహ్యపడువారికి కూడ శాంతి కలుగును. సాయిబాబా చక్కని యాకారము చూడగనే సంతసము కలుగును. కండ్లనిండ నీరు నిండును, మనస్సు ఊహలతో నిండును. నేనేపరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొల్పి ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను, నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మములో నైక్యము చేయును. వేదములుగాని, పురాణములుగాని పారాయణ చేయునప్పుడు శ్రీసాయి యడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. శ్రీసాయిబాబా రాముడుగా గాని, కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునట్లు చేయును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకము కృష్ణునివలె గాన్పించును. భాగవతమో, ఉద్ధవగీతయో పాడుచున్నట్లుగ అనిపించును. ఎవరితోనైన సంభాషించునపుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నేనేదైన వ్రాయ తలపెట్టినచో వారి యనుగ్రహము లేనిదే యొక్క మాటగాని వాక్యముగాని వ్రాయలేను. వారి యాశీర్వాదము లభించిన వెంటనే యంతులేనట్లు వ్రాయగల్గుదును. భక్తునిలో యహంకారము విజృంభించగనే బాబా దానిని యణచివేయును. తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతుష్టుజేసి యాశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము జేసి సర్వస్యశరణాగతి చేసినవానికి ధర్మార్థకామమోక్షములు సిద్ధించును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి యను నాలుగు మార్గములు కలవు. అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది. దాని నిండ ముండ్లు గోతులుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని నడచినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను.
స్వయంపుత్తాకమైన బ్రహ్మముయొక్క తత్వవిచారము చేసిన పిమ్మట, బ్రహ్మముయొక్క శక్తి (మాయ), బ్రహ్మసృష్టినిగూర్చి చెప్పి వాస్తవమునకీ మూడును నొకటియేయని సిద్ధాంతీకరించి, రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు.
“నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యోగక్షేమముల నేను జూచెదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ ఇట్లనే చెప్పియున్నాడు. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీ కేమైన కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములో పేరుకీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచగౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవముయొక్క యాకారము నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధనకొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనునట్లు మనస్సును నిలుపుము. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను, యెట్టి చికాకు లేక యుండును. అప్పుడే మనస్సు సరియైన సాంగత్యములో నున్నదని గ్రహింపుము. మనస్సు చంచలముగ నున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే”.
బాబా మాటలుదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను. షిరిడీలో జరుగు నుత్సవము లన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయిలీల (1925 – పుట 197) పత్రికలో విపులముగ వర్ణింపబడిన శ్రీరామనవమి యుత్సవముల సంగ్రహ మిచట పేర్కొనబడుచున్నది.
కోపర్ గాం లో గోపాలరావుగుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్పభక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీ సాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను. దానికాతడు మిక్కిలి సంతసించి షిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని 1897లో భావించెను. ఈ విషయమై తక్కిన భక్తులగు తాత్యాపాటీలు, దాదా కోతేపాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా యాశీర్వాదమును, అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా యాశీర్వదించియుండుటచే రెండవపర్యాయము ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబావారికేదో యింకొక ఉద్దేశమున్నట్లు కనుపించుచున్నది. ఈ యుత్సవమును శ్రీ రామనవమితో కలుపుట, హిందువుల మహమ్మదీయుల మైత్రికొరకు కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా యుద్దేశములు రెండును నెరవేరినవి.
ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెనుగాని యితర కష్టములు గాన్పించెను. షిరిడీ చిన్న గ్రామమగుటచే నీటి యిబ్బంది యెక్కువగా నుండెను. గ్రామమంతటికి రెండు నూతులుండెడివి. ఒకటి యెండాకాలములో నెండిపోవుచుండును. రెండవదానిలోని నీళ్ళు ఉప్పనివి. ఈ ఉప్పునీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళబావిగా మార్చెను. ఈ నీరు చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరమునుంచి మోటలద్వారా నీరు తెప్పించెను. అప్పటికి మాత్రమే పనికివచ్చునట్లు అంగళ్ళు వేసిరి. కుస్తీల కొరకేర్పాటు చేసిరి.
గోపాలరావుగుండున కొకస్నేహితుడు గలడు. వాని పేరు దాము అణ్ణా కాసార్. అతనిది అహమద్ నగరు. ఆతనికి కూడ ఇద్దరు భార్యలున్నప్పటికి సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వాదముతో పుత్రసంతానము గలిగెను. ఉత్సవముకొరకు ఒక జండా తయారు చేయించెను. అట్లనే నానాసాహెబు నిమోన్కరును ప్రబోధించగా అతడు కూడ ఒక నగిషీజండా నిచ్చుటకు ఒప్పుకొనెను. ఈ రెండుజండాలు ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండుమూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు. బాబా యుండు మసీదుకు ద్వారకామాయి యని పేరు.
చందన ఉత్సవము
ఈ ఉత్సవములో నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాహ్లే గ్రామమందు అమీరు షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవము ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్దనుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను, గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి మూడు సంవత్సరములు ఈ యుత్సవము అమీరుషక్కరు జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకేదినమందు పగలు హిందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి.
ఏర్పాట్లు
శ్రీరామనవమి బాబాభక్తులకు ముఖ్యమైనది; పవిత్రమైనది. భక్తులందరు వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నియు తాత్యాకోతే పాటీలు చూచుకొనెడివారు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను. ఆమె యింటినిండ భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నియు సమకూర్చుచుండెను. ఉత్సవమునకు కావలసినవన్నియు సిద్ధపరచుచుండెను. ఆమె స్వయముగా మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదుగోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండియుండెడివి. వానిని చక్కగా కడిగి సున్నము పూయుచుండెను. ఒక్కొక్కప్పుడు మండుచున్న ధునికూడ తీసి బయట పెట్టుచుండెను. ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజుముందే చేయుచుండెను. బీదలకు అన్నదానమనగా బాబాకు చాలప్రీతి. అందుచే బీదలకు అన్నదానము ఈ యుత్సవముయందు విరివిగా చేయుచుండిరి. వంటలు విస్తారముగ, మిఠాయిదినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండిరి. ఇందులో అనేకమంది భక్తులు పూనుకొనుచుండెడివారు.
మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట
ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను. రాను రాను వృద్ధియగుచుండెను. 1912లో నొక మార్పుజరిగెను. “సాయి సగుణోపాసన”ను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయనువాడు దాదాసాహెబు ఖాపర్డే (అమరావతి నివాసి)తో నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బసచేసిరి. కృష్ణారావు వసారాలో చేరగిలి యుండగా కాకామహాజని పూజాపరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక క్రొత్తయాలోచన తట్టెను. వానిని పిలిచి యిట్లనెను. “ఈ యుత్సవమును శ్రీరామనవమినాడు చేయుటలో భగవదుద్దేశ మేదియో యుండవచ్చును. శ్రీరామనవమి యుత్సవమనగా హిందువులకు చాల ముఖ్యము. కనుక యీ దినమందు శ్రీరామనవమి యేల జరుపకూడ”దని యడిగెను. కాకామహాజని యీ యాలోచనకు సమ్మతించెను. బాబా యనుమతి దెచ్చుటకు నిశ్చయించిరి. ఒక కష్టము మాత్రము తీరనిదిగా గాన్పించెను. అది హరిదాసును సంపాదించుట. భగవన్మహిమలను కీర్తనచెయుటకు హరిదాసు నెచ్చటనుండి తేవలెననునది గొప్ప సమస్యగా నుండెను. తుదకది భీష్ముడే పరిష్కరించెను. ఎట్లన, అతని రామాఖ్యానమను శ్రీ రాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు, కాకామహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి. చక్కెరతో కలిపిన శొంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా యనుమతి బొందుటకై మసీదుకు పోయిరి. అన్నిసంగతులు మసీదునందుండియే గ్రహించుచున్న బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా యదేప్రశ్న భీష్ముడనడిగెను. అతడు శ్రీరామ నవమి యుత్సవము చేయ నిశ్చయించితి మనియు నందులకు బాబా యనుమతి నివ్వవలెననియు కోరెను. బాబా వెంటనే యాశీర్వదించెను. అందరు సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటిదినమున మసీదు నలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయల వ్రేలాడగట్టిరి. దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామజన్మోత్సవము ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. అప్పుడే లెండీ వనమునుండి మసీదుకు వచ్చిన బాబా, అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. అతడు కొంచెము జంకెను. జన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో యని అతడు సంశయించెను. అతడు బాబావద్దకు వెళ్ళిన తోడనే యిదినంతయు యేమని బాబా యడిగెను. ఆ ఊయల యెందుకు కట్టిరని యడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులోనుండు భగవంతుని నిర్గుణస్వరూపమగు ‘నింబారు’ (గూడు) నుండి యొక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి యింకొకటి భీష్మునకి పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. కొంతసేపటికి కథ ముగిసెను. ‘శ్రీ రామచంద్రమూర్తికీ జై’ యని ఎర్రగుండ బాజాభజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి. అందరు సంతోషములో మునిగిరి. అంతలో నొకగర్జన వినబడెను. చల్లుచుండిన గులాల్ యను ఎర్రపొడుము ఎటులనో బాబా కంటిలో పడెను. బాబాకోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. జనులందరు ఇది చూచి భయపడి పారిపోయిరి. కాని బాబా భక్తులు, అవన్నియు తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా యాశీర్వాదములని గ్రహించి పోకుండిరి. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే యహంకారమును, దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబారూపములోనున్న రాముడు తప్పక కోపించవలెననిరి. షిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక యలవాటు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతనివద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి యా మరుసటిదినము శ్రీకృష్ణజననమునాడు పాటించు ‘కాలాహండి’ యను నుత్సవము జరిపినపిమ్మట తీసివేయవచ్చునని చెప్పెను. కాలాహండి యనగా నల్లనికుండలో అటుకులు, పెరుగు, ఉప్పుకారముకలిపి వ్రేలాడ గట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్లపిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. ఆ మరుసటిదినము ఇవన్నియు పూర్తియైనపిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవసమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను. అప్పటినుండి జాతర (మేళ) శ్రీరామనవమి యుత్సవముగా మారెను.
1913 నుంచి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు హెచ్చించిరి. చైత్రపాడ్యమినుంచి రాధాకృష్ణమాయి ‘నామసప్తాహము’ ప్రారంభించుచుండెను. భక్తులందరు అందు పాల్గొందురు. ఆమె కూడ వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతట శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథాకాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5, 6 రోజులు ముందు మహాజని బాలబువ మాలీని (ఆధునిక తుకారామ్) కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొనివచ్చెను. ఆ మరుసటి సంవత్సరము అనగా 1914లో సతారాజిల్లా బిర్హాడ్ సిద్ధకవఠె గ్రామములోని హరిదాసుడగు బాలబువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత కథలు చెప్పక ఖాళీగానుండెను. బాబా యనుమతి కాకా ద్వారా పొంది అతడు షిరిడీ చేరెను. హరికథ చెప్పెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను 1914వ సంవత్సరములో శ్రీ సాయి పరిష్కరించెను. ఈపని శాశ్వతముగా దాసగణు మహారాజునకు అప్పగించెను. ఈనాటివరకు దాసగణు ఈ కార్యమును జరుపుచున్నారు.
1912 నుండి ఈ యుత్సవము రానురాను వృద్ధిపొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తుమ్మెదల పట్టువలె ప్రజలతో నిండుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీలలో ననేకమంది పాల్గొనుచుండిరి. బీదలకు అన్న సంతర్పణ బాగుగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శ్రీసాయిసంస్థాన మేర్పడెను. అలంకారములు; ఆడంబరము లెక్కువాయెను. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రథము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులుకూడ వచ్చెను. ఇవన్నియు హెచ్చినప్పటికి సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్యవిషయమేమన హిందువులు, మహమ్మదీయులు కలసిమెలసి యెట్టి కలహములు లేకుండ గడిపేవారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తుదకు 75,000 వరకు రాజొచ్చిరి. అంతమంది గుమిగూడినప్పిటికి ఎన్నడైనను వ్యాధులుకాని జగడములుగాని కనిపించలేదు.
మసీదు మరామతులు
గోపాలరావుగుండునకు ఇంకొక మంచియాలోచన తట్టెను. ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదుమరామతుచేయ నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈపని బాబా అతనికి నియమించలేదు. ఈ పని నానాసాహెబు చాందోర్కరుకు, రాళ్ళుతాపన కాకాసాహెబు దీక్షిత్ కు నియోగించెను. ఈ పనులు చేయించుట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహళ్సాపతి కల్గించుకొనుటవలన బాబా యనుమతి నిచ్చెను. బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళచే తాపనచేయుట ముగించిరి. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్నపరుపుమీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 వ సంపత్సరములో సభామండపము పూర్తిచేసిరి. మసీదుకు ముందున్న జాగా చాల చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బుపెట్టి యినుపస్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రియంతయు శ్రమపడి స్తంభములు నాటిరి. ఆ మరుసటిదినము ప్రాతఃకాలముననే బాబా చావడినుండి వచ్చి యది యంతయు జూచి కోపించి వానిని పీకి పారవైసెను.
ఆసమయమందు బాబా మిక్కిలి కోపోద్ధీపితుడయ్యెను. ఒకచేతితో ఇనుపస్తంభము బెకిలించుచు, రెండవచేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పుకణములవలె వెలుగుచుండెను. ఎవరికిని బాబావైపు చూచుటకు ధైర్యము చాలకుండెను. అందరు భయకంపితులైరి. బాబా తన జేబులోనుంచి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యాకూడ చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమియు తెలియకుండెను. అందులో కల్పించుకొనుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. కుష్ఠురోగియు బాబా భక్తుడునగు భాగోజి శిందియా కొంచెము ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసెను. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది జోలికి పోదలచిరో అందరికి యొకేగతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను, ఒక దుకాణదారుని పిలిపించెను. వానివద్దనుంచి జరీపాగాను క్రయమునకు దీసికొనెను, దానిని బాబా స్వయముగా తాత్యాతలకు చుట్టెను. తాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా యిట్లు చేసియుండెను. బాబాయొక్క యీ వైఖరిని జూచినవా రెల్లరు నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించెను? వారికొపము తత్ క్షణమే ఎట్లు చల్లబడెను? అని యందరు ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చిండి యత్యంతానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కొపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను.
ఓం నమోః శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఆరవ అధ్యాయము సంపూర్ణము.
|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|