Sai Satcharitra

పండ్రెండవ అధ్యాయము

శ్రీ సాయి సత్ చరిత్రము
పండ్రెండవ అధ్యాయము
Shri Sai Satcharitra – Chapter 12

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

పండ్రెండవ అధ్యాయము

శ్రీ సాయి లీలలు: 1. కాకామహాజని, 2. ధుమాల్ ప్లీడరు, 3. నిమోంకర్ భార్య, 4. ములేశాస్త్రి, 5. ఒక డాక్టరు – వీరి యనుభవములు.

భక్తులను బాబా ఎట్లు కలుసుకొనేవారో ఎట్లు ఆదరించేవారో ఈ యధ్యాయములో చూచెదము.
యోగుల కర్తవ్యము
శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతు డవతరించుచున్నాడను సంగతి పూర్వపు ఆధ్యాయములలో తెలిసికొన్నాము. కాని యోగుల కర్తవ్యము పూర్తిగా వేరే. వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యునివంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. యథార్థముగ భగవంతునికంటె వారు వేరుకారు. యోగులలో నొకరగు సాయి, భక్తుల క్షేమముకొరకు అవతరించిరి. జ్ఞానములో సుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగ ప్రేమించు వారు. వారికి దేనియందు నభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు, అందరు వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తులకొరకు తమ పుణ్యము నంతను వ్యయపరచి యెప్పుడును వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారి కిచ్చలేనిచో భక్తులు వారివద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు కూడ ఎరిగి యుండరు. అట్టివారికి బాబాను జూచుట కెట్లు బుద్ధి పుట్టును? కొందరు బాబాను చూడవలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందులోపల వారికా యవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనమువల్ల కలుగు సంతుష్టి పొందుదురు. కొంద రదృష్టవశమున వారి దర్శనము చేసికొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని కోరినను నచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ యెంతవరకు గలదో యంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి యుండెను.
కాకా మహాజని
ఒకప్పుడు బొంబాయినుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి యుత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దర్శించినవెంటనే అతనితో బాబా యిట్లనిరి. “ఎప్పుడు తిరిగి యింటికి పోయెదవు?” ఈ ప్రశ్న విని కాకా యాశ్చర్యపడెను. కాని జవాబు నివ్వవలసియుండెను. బాబాయాజ్ఞ యెప్పుడయిన నప్పుడే పోయెదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా యిట్లనియెను. “రేపు, పొమ్ము” బాబా వాక్కు ఆజ్ఞతో సమానము. కావున నట్లే చేయవలసి వచ్చెను. అందుచే నా మరుసటిదినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన కచేరికి పోగనే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని యున్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకామహాజని ఉండవలసిన యవసరమెంతేని యుండెను. యజమాని షిరిడీలోనున్న కాకా కొక యుత్తరము ఈ విషయమై వ్రాసెను. అది బొంబాయికి తిరిగి చేరినది.
భాఊ సహెబు ధుమాళ్ (ప్లీడర్)
పై దానికి వ్యతిరేకముగ కథ నిప్పుడు వినుడు. భాఊ సాహెబు ధుమాళ్ కోర్టుపనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసెను. వెంటనే నిఫాడ్ పోవ ప్రయత్నించెను. కాని బాబా యందుల కాజ్ఞఇవ్వలేదు. షిరిడీలోనే యింకొక వారముండునట్లు చేసెను. ఈలోగా నిఫాడ్ మెజస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడెను. తరువాత ధుమాళ్ నిఫాడ్ కు పోయి కేసుకు హాజరగుటకు సెలవుపొందెను. అది కొన్ని నెలలవరకు సాగెను. నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాళ్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను.
నిమోన్కర్ భార్య
నిమోను గ్రామము వతనుదారును, గౌరవమెజిస్ట్రేటును అగు నానా సాహెబు నిమోన్కరు, షిరిడీలో తన భార్యతో నుండెను. ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోనే గడుపుచు బాబాసేవ చేయుచుండిరి. బేలాపూరులోనున్న వారి కుమారుడు జబ్బుపడెను. బేలాపూర్ పోయి బాలుని, అచటి బంధువులను జూచి, యక్కడ కొన్నిదినములుండవలెనని తల్లి నిశ్చయించు కొనెను. కాని ఆ మరుసటిదినమే తిరిగి రావలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధములో పడెను. ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవము శ్రీ సాయినాథుడే యామెకు సహాయపడెను. బేలాపూరుకు పోవుటకుముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠెవాడ ముందర నానాసాహెబు మొదలగు వారితోనుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారములు చేసి బేలాపూరు పోవుటకు ఆజ్ఞ నిమ్మని వేడుకొనెను. బాబా యిట్లు చెప్పెను. “వెళ్ళుము, ఆలస్యము చేయకుము, ప్రశాంతముగా, నెమ్మదిగా బేలాపూరులో సుఖముగా నాలుగుదినము లుండుము; నీ బంధువు లందరిని చూచిన పిమ్మట షిరిడీకి రమ్ము.” బాబా మాటలెంత సమయానుకూలముగ నుండెనో గమనించుడు. నానాసాహెబు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దుచేసెను.
నాసిక్ నివాసియగు ములేశాస్త్రి
ములేశాస్త్రి యాచారముగల బ్రాహ్మణుడు. ఆయన నాసిక్ వాసి. ఆయన ఆరుశాస్త్రములను చదివిరి. ఆయనకు జ్యోతిష్యము, సాముద్రికము కూడ బాగుగ తెలియును. అతడు నాగపూరు కోటీశ్వరుడగు బాపు సాహెబు బుట్టీని కలిసికొనుటకు షిరిడీ వచ్చెను. బుట్టీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడిపండ్లను, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికి పంచి పెట్టుచుండెను. బాబా చిత్రముగా మామిడిపండును అన్ని వైపుల నొక్కుచుండెను. దానిని తినువారు నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి బోయి తొక్క, టెంక వెంటనే పారవేయుటకు వీలగుచుండెను. అరటిపండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచి పెట్టి తొక్కలు బాబా యుంచుకొనెడివారు. ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుమని యడిగెను. బాబా దానిని వినక నాలుగు అరటిపండ్ల నిచ్చెను. తరువాత నందరు వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని యగ్నిహోత్రము మొదలగునవి యాచరించుటకు మొదలిడెను. బాబా మాములుగనే లెండితోటకు బయలుదేరెను. మార్గమధ్యమున “గేరు (ఎఱ్ఱరంగు) తయారుగ నుంచుడు. ఈనాడు కాషాయవస్త్రమును ధరించెదను” అని బాబా యనెను. ఆ మాట లెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీతోటనుంచి తిరిగివచ్చెను. మధ్యాహ్నహారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్నహారతికి తనతో వచ్చెదరా యని ములేశాస్త్రిని బుట్టీ యడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసికొనెదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన యాసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్దనుంచి దక్షిణ తెమ్మనెను. బుట్టీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా యాజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను. తనలో తా నిట్లనుకొనెను. “నేను పూర్తిగ ఆచారవంతుడను, నే నెందులకు దక్షిణ నీయవలెను? బాబా గొప్ప యోగియైయుండవచ్చును. నేను వారిపై ఆధారపడి యుండలేదు.” గొప్ప యోగివంటి సాయి ధనికుడగు బుట్టీ ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేక పోయెను. తనపూజ ముగియకముందే వెంటనే బుట్టీతో మసీదుకు బయలుదేరెను. తాను పవిత్రుడ ననుకొని, మసీదట్టిది కాదని, బాబాకు దూరముగ నిలువబడి, పువ్వులను బాబాపై విసరెను. హఠాత్తుగా బాబా స్థానములో, గతించిన తన గురువగు ఘోలవ్ స్వామి కూర్చొనియుండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది యొక స్వప్నమేమోయని తలచెను. కాని యతడు జాగ్రదవస్థలో నున్నప్పుడు స్వప్న మెట్లగును? అయితే వారి గురువచ్చట కెట్లు వచ్చెను? అతని నోట మాట రాకుండెను. చైతన్యము తెచ్చుకొని తిరిగి యాలోచించెను. కాని తనగురువు మసీదులో నెందుకుండునని భావించెను. తుదకు మనస్సందిగ్ధము లన్నియు విడచి మసీదు పై కెక్కి, తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించుకొని నిలువబడెను. తక్కిన వారందరు బాబా హారతిని పాడిరి. కాని ములేశాస్త్రి తన గురుని నామము నుచ్చరించెను. గొప్పజాతివాడనను గర్వము, తాను పవిత్రుడనను సంగతిని యటుండనిచ్చి తనగురుని పాదములపైబడి సాష్టాంగ మొనర్చి, కండ్లు మూసికొనెను. లేచి కండ్లు తెరచునంతలో, బాబా వానిని దక్షిణ యడుగుచున్నట్లు గాంచెను. బాబావారి చిన్నయాకారమును ఊహకందని వారి శక్తిని జూచి ములేశాస్త్రి మైమరచెను; మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోషభాష్పములచే నిండెను. బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తనగురువును దర్శించితిననియు చెప్పెను. బాబాయొక్క ఆ యాశ్చర్యలీలను గాంచినవారందరు నిర్ఘాంతపోయిరి. అప్పుడు వారు బాబా పలికిన పలుకులు “గేరు తెండు! కాషాయవస్త్రముల ధరించెద” నను మాటల అర్థము గ్రహించిరి. అట్టిది సాయియొక్క యాశ్చర్యకరమైన లీల.
ఒక డాక్టరు
ఒకనాడొక మామలత్ దారు తన స్నేహితుడగు డాక్టరుతో షిరిడీకి వచ్చెను. ఆ డాక్టరు తన దైవము శ్రీరాముడనియు, తాను మహమ్మదీయునికి నమస్కరించననియు, షిరిడీ పోవుటకు మనస్సు అంగీకరించలేదనియు చెప్పెను. నమస్కరించుమని బలవంతపెట్టువారు కాని చెప్పువారు కాని యెవరు లేరని తనతో కలసి రావలెననియు సంతోషముగా కాలము వెలిబుచ్చవలెననియు మామలతదారు జవాబిచ్చెను. ఇట్టి ఉద్దేశముతోనే బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటె ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట జూచి అందరు ఆశ్చర్యనిమగ్నులైరి. తన మనోనిశ్చయమును మార్చుకొని మహమ్మదీయునికెట్లు నమస్కరించెనని యందరు నడుగసాగిరి. తన ప్రియదైవమగు శ్రీ రాముడు యాగద్దెయందు గాన్పించుటచే వారి పాదములపై బడి సాష్టాంగనమస్కార మొనర్చితినని డాక్టరు బదులిడెను. అట్లనునంతలో తిరిగి సాయిబాబానే యచ్చట గాంచెను. ఏమీ తోచక ‘ఇది స్వప్నమా యేమి? వారు మహమ్మదీయు డెట్లు? వారు గొప్ప యోగసంపన్నుల యవతారము’ అని నుడివెను.

ఆ మరుసటి దినమే డాక్టరు ఒక ప్రతిజ్ఞ చేసి యుపవాసముండెను. బాబా తనను ఆశీర్వదించువరకు మసీదుకు బోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు మూడు రోజులు గడచెను. నాలుగవ దినమున తన ప్రియస్నేహితు డొకడు ఖాందేషునుండి రాగా వానితో కలసి మసీదులోని బాబా దర్శనమునకై పోయెను. బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైన బిలువగా తాను వచ్చెనా యేమి యని బాబా అతనిని ప్రశ్నించెను. ఈ ప్రశ్న వినుసరికి డాక్టరు మనస్సు కరగెను. ఆనాటి రాత్రియే నిద్రలో బాబా యాశీర్వాద మందుకొనెను. గొప్పయానంద మనుభవించెను. పిమ్మట తన గ్రామమునకు బోయెను. ఆ యానందము 15దినములవర కనుభవించెను. ఆ ప్రకారముగా సాయిబాబా యందు భక్తి వాని కనేక రెట్లు వృద్ధి పొందెను.

పై కథలవలన ముఖ్యముగా ములేశాస్త్రి కథవలన నేర్చుకొనిన నీతి యేమన మనము మన గురువునందే స్థిరమయిన నమ్మక ముంచవలెను. దానిని ఇంకెక్కడికిని మార్చకూడదు. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
పండ్రెండవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *