తెలంగాణ సీమలో స్థితప్రజ్ఞ యోగి -శ్రీ అఖండానంద సరస్వతీ స్వామి
తెలంగాణ సీమలో స్థితప్రజ్ఞ యోగి శ్రీ సీతారామాశ్రమ వ్యవస్థాపకులు
శ్రీ అఖండానంద సరస్వతీ స్వామి
ఉత్కృష్ట సిద్ధాశ్రమం మాసాయిపేట శ్రీ సీతారామాశ్రమం
ఎందరో మహాత్ములు, కారణజన్ములు, పరమహంసల పరమ కరుణా కిరణాల తేజస్సు ద్వారా కర్మభూమి భారతావని విశ్వమానవాళికి మార్గదర్శనమయింది. ఈ భూమిపై అవతరించి పరమ పవిత్రం చేసిన యతీశ్వరుల ఆధ్యాత్మిక పరిమళాలు భారతీయతత్వానికి అహరహం గుబాళిస్తూనే ఉన్నాయి. అలాంటి మహానుభావుల కోవలో వినిర్మల జీవనం ద్వారా తమ జీవితాన్నే సందేశంగా అందించి శ్రీరామ నామామృతాన్ని తనివితీరా భక్తజనులకు ఆదరంగా అందించిన యతిపుంగవులు శ్రీశ్రీశ్రీ అఖండానంద సరస్వతీ స్వామివారు. యోగానిష్ఠాగరిష్ఠులుగా, తపోసాధన ద్వారా జ్ఞానామృతాన్ని, దివ్యత్వాన్ని పొంది తెలంగాణ సీమలో ఆధ్యాత్మిక రోచస్సులను ప్రసరింపజేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామ శివారుల్లో శ్రీసీతారామాశ్రమాన్ని స్థాపించి భక్త జనులకు రామామృతాన్ని పంచారు. ఈ ఆశ్రమంలో శ్రీసీతారామచంద్ర స్వామివార్ల దివ్యధామాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక బోధనలు, ఏటా ఉత్సవాలు, సత్సంగాల ద్వారా జ్ఞానబోధలు అందిస్తూ శిష్యకోటిని పునీతుల్ని చేశారు. 85 ఏళ్ళ ప్రాయంలో దేహం చాలించిన స్వామివారు తమ జీవనంలో దాదాపు 7 దశాబ్దాల పాటు ఆధ్యాత్మిక యోగసాధనలో గడిపారు. వీరు స్థాపించిన శ్రీసీతారామాశ్రమం ఇప్పటికీ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆశ్రమం స్థాపించి, శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ గావించి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్వామివారి జీవనరేఖలు, ఆశ్రమ విశిష్టతపై ‘దర్శనమ్’ అందిస్తున్న విశిష్ట వ్యాసం.
అఖండ మండలాకారం వ్యాప్తం సర్వచరాచరం ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ।।
నిరాకారుడైన పరమాత్మ లోకోద్ధరణార్థం అనేక అవతారాలు ఎత్తుతున్నాడు. ధర్మానికి క్షతి కలిగి, అధర్మం పెచ్చు పెరుగుతున్న సమయంలో ‘దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకై ప్రతి యుగములోను తాను అవతరించుచున్నా’నని భగవద్వాక్యము. ఈ సత్య వివరణ కొరకే అష్టాదశ పురాణాలు వ్యాసప్రోక్తములై జగత్తునకు సత్యమంటే ఏమిటో ప్రబోధించాయి.
మనుష్యులను సహజ గుణాల ద్వారా పొందే సుఖ దుఃఖాల నుండి మరలించి ఈశ్వరాభిముఖులను చేయ డానికి పరమాత్మ మాటిమాటికీ మహాత్ముల రూపాన అవతరిస్తున్నాడు. ఈ కలియుగంలో మహాత్ములే భగవదవ తారమూర్తులు. అట్టి మహాత్ములు ఆచరణ రూప ధర్మకార్యాలతో, సత్యాన్వేషకులై సదుపదేశాల ద్వారా లోకులను సత్యపథగాములను చేయడానికి తమ తపఃకాల శేషమును వినియోగిస్తూ నిష్పక్షపాతులై నిర్మములై నిరహంకారులై లోకోపకారమొనర్చి తాము తరించి ఇతరులను తరింప చేస్తున్నారు. అటువంటి మహాత్ములు కొందరు బ్రహ్మచారులు గను, కొందరు గృహస్థులై సంసారమునంటని వారుగను, కొందరు సర్వసంగ పరిత్యాగులై సన్యసించి కలియుగ లక్షణాల కతీతులయి ఆదర్శజీవనులై ఉన్నారు.
అఖండానందుల బాల్యం
అట్టి మహాత్ములు వారి ధర్మ ప్రబోధాలతో సమకాలికులకు మాత్రమే గాక ప్రాంతకాల పరిమితులు లేని అందరికీ ఉపయోగపడతారు. అటువంటి వారిని ఆశ్రయించి, ధర్మాన్ని ఆచరించి, తరించిన వారెందరో ఉన్నారు. ఆ కోవలోనే శ్రీశ్రీశ్రీ అఖండానంద సరస్వతీ స్వాములవారు. వీరి పూర్వాశ్రమ నామం కాసుల రామచంద్రయ్యగారు. వీరు మెదకు జిల్లా సిద్ధిపేట తాలూకాలోని కుకునూరుపల్లి గ్రామంలో 1905 సెప్టెంబర్ 10న జన్మించారు.
వీరి వంశం కాసులవారు. ఇది పెద్ద వంశం. వీరి తాతగారు బ్రహ్మశ్రీ కాసుల అనంతరామశర్మగారు. శ్రీవత్సస గోత్రీకులై శుద్ధ శోత్రియాచారము గలవారై ధ్యాననిష్ఠాపరాయణులైన వేదవేదాంగ పారగులు. పౌరోహిత్యం వృత్తిగా కుకునూరుపల్లి గ్రామ ప్రజల ఆదరాభిమానాలను చూరగొనుటయే గాక మంచి యాజ్ఞీకులై విప్రులలోను వినుతికెక్కారు. వారి సహధర్మచారిణి శ్రీమతి వేంకట లక్ష్మమ్మగారు నిత్యం గౌరీసేవాపరాయణులై భర్త కనుసన్నలలో మెలగుచు అన్నపూర్ణగా కీర్తిగాంచారు.
ఆమె గర్భమున బ్రహ్మశ్రీ వేంకటేశం గారు జన్మించి తండ్రి దగ్గరనే వేదాది స్మార్తకర్మలన్నీ అభ్యసించి బాల్యంలోనే చి. కాశమ్మ అనే కన్యకామణిని వివాహమాడి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించుచుండేవారు. ఆమె కూడా భర్తకు తలలోని నాలుక వలె మెలగుచు, ఇంటికి వచ్చిన వారిని కన్నతల్లి వలె ఆదరించి, అందరికీ ప్రీతిపాత్రురాలైనారు.
భగవత్సేవ ఫలంగా ఆ దంపతులకు నలుగురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు జన్మించారు. పెద్దవాడు మెట్టయ్య, రెండవ వాడు అనంతయ్య, మూడవవాడు నరహరి, నాల్గవవాడు చివరివాడైన రామచంద్రయ్య మనం సేవించుకొనగలిగిన మహనీయులు. వెంకమ్మ, సత్యమ్మ సోదరీమణులు. ఈయన జననం విశ్వావసు నామ సం।।ర భాద్రపద శుద్ధ ద్వాదశి ఆదివారం. తేదీ 10.9.1905.
ఈయన చిన్నప్పటి నుండి భగవద్ధ్యాన పరాయణుడై గర్భాష్టమంలో ఉపవీతుడై తండ్రికి, అన్నలకు విధేయుడుగా ఉండేవారు. ఏమాత్రం ఏకాంతం దొరికినా ఒక గదిలో భగవద్ధ్యానము చేసుకొనేవాడు. ఒకనాడు వీరి తల్లి శ్రీమతి కాశమ్మ గారు ‘‘మా రామచంద్రయ్య వచ్చినాడా?’’ అని ఇల్లిల్లూ తిరిగి వెదకి వచ్చి, విసుగు చెంది ‘‘వీడెక్కడకు పోయినాడో కదా! మిట్ట మధ్యాహ్నం దాటినా ఆకలికడుపెరగక ఎప్పుడు వస్తాడో కదా!’’ అని ఎదురుచూస్తున్నది. నాలుగు గంటల సమయంలో పస్తుగానే ఉన్న తల్లిని పిలుస్తూ గదిలో నుండి బయటకు వచ్చినాడట.
‘‘ఎక్కడికి పోయినావురా? ఇల్లిల్లూ వెదకి వచ్చినాను, నాయనా! ఆకలి వేయడం లేదా? పద, పద తిందువుగాని’’ అని చెప్పిన తల్లితో ‘‘నిరంతరం భగవద్ధ్యానం చేసుకునే నాకు ఆకలి కాలేదమ్మా! నేను ఈ ప్రక్క గదిలోనే ఉన్నాను. అయ్యో! నా కొరకు ఊరంతా వెదకి ఆయాస పడ్డావుగదమ్మా! క్షమించమ్మా! ఇక సాయంత్రానికి తింటానులే’’ అన్నాడు.
‘‘ఇప్పుడే తిను ప్రొద్దటినుండి పొట్టమాడ్చుకొని ధ్యానం చేస్తే శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా! నీవు లేక నేనూ భోజనం చేయలేదు. రాత్రికి కొంచెం ప్రొద్దుపోయాక తిందువులే’’ అని అమ్మ బలవంతం చేస్తే కాదనలేకపోయాడు.
13వ ఏటే వివాహం
విద్యాభ్యాసమంతా తమ బావగారైన బ్రహ్మశ్రీ నరసింహశాస్త్రి గారింట్లో (మఱ్ఱిముచ్చాల – వరంగల్ జిల్లా) ఉండి బట్టలుతుకుట దగ్గర నుండి అన్ని పనులలో అక్కగారైన శ్రీమతి సత్యమ్మ గారికి సహకరించి వీలు చిక్కినప్పుడల్లా చీకటిగా నుండి తరచుగా ఎవరూ రాని సామానుల గదిలో ధ్యానమగ్నుడై ఉండేవాడు. పెద్ద కుటుంబం కనుక పోషణభారాన్ని మోయలేని తండ్రికి తోడుగా ఉండలేక తూప్రాన్ (మెదక్ జిల్లా)లో పౌరోహిత్యం చేసుకుంటూ ఉండగా మాసాయిపేటలోని విశ్వామిత్ర గోత్రజుడైన బ్రహ్మశ్రీ వేంకటరామయ్య, రత్నమ్మ దంపతులు ఈయన సౌశీల్యాన్ని మెచ్చి తమ కూతురు చి. రాజమణిని ఇచ్చి వివాహం చేశారు. నిర్లిప్తుడుగా ఉన్న తనకు 13వ ఏటనే వివాహ బంధం విధి లిఖితమని భావించి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న తనకు రాముడు చూపిన ఆసరా కావచ్చునని భావించాడు.
అత్తవారిచ్చిన కొద్దిపాటి భూమి, పౌరోహిత్యం చేయగా వచ్చిన ఆదాయం సరిపోకపోయినా చింతించక నిరంతర ధ్యానమగ్నుడై ఉండే ఈయన తత్వాన్ని గ్రహించిన తూప్రాన్ గ్రామస్థులు ఒక ఇల్లు కట్టించి ఇచ్చారు.
ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానాదికాలు ముగించి ధ్యానంలో ఉండే వీరికి వాసర సన్నిధిలో శ్రీ సరస్వత్యనుగ్రహం కొరకు తపస్సు చేయాలని అనిపించింది. అతి కష్టంతో వాసర చేరి 40 రోజులు కఠినోపవాసంతో గాయత్రీ మంత్రానుష్ఠానం చేశారు. గాయత్రి మంత్రం ఉపనయనంలో తండ్రిగారు ఉపదేశిస్తారు కనుక అనుష్ఠానమునకు వేరొక గురువుగారి ఆవశ్యకత ఉండదనియు, గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదని, గాయత్రీదేవి ఉదయాన, సావిత్రీదేవి మధ్యాహ్నాన, సరస్వతీదేవి సాయంకాలాన సంధ్యలో ఉపాసింపబడతారు కనుక గాయత్రీ మంత్రానుష్ఠానం కూడా సరస్వత్యుపాసనగానే భావించారు. అక్కడ (వాసర సరస్వతీ సన్నిధిలో) మాధుకరవృత్తి తప్పనిసరియని యెరిగిన వీరు ఒకరోజు మాధుకరమును చేశారు. అమ్మవారు స్వప్న దర్శనమిచ్చి తిరుపతికి వెళ్ళుటకు ఆదేశించినదట. అంతేగాక ఒక ఆశ్రమాన్ని స్థాపించి ధర్మప్రచారం చేయగలరని చెప్పినదట.
ఇంటిలో ఎవరికీ చెప్పకుండానే తిరుపతికి వెళ్ళారు. తిరుమలకు కాలినడకన వెళ్ళి, శ్రీ వరాహస్వామిని, శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించి, నడక యొక్క అలసటను తీర్చుకోదలచి విశ్రమించారు. తాను వచ్చిన పని పూర్తి కాలేదని, తానేం చేయడానికి తిరుపతికి రావడానికి ఆదేశింపబడ్డానో అని యోచించి మూడు రోజులు అక్కడ ఉన్నారట. అక్కడున్న మూడు రోజులు ధ్యానానికి మనస్సు నిలవలేదట. ఇంతలో అక్కడి గోగర్భంలో శ్రీ మలయాళస్వామివారు (వీరు మలయాళ దేశము నుండి వచ్చుట కారణంగా ఆ పేరుతోనే పిలువబడ్డారు. వీరి నామధేయం ఎవరికీ తెలియదు.) తర్వాతి కాలంలో వీరు స్థాపించిన వ్యాసాశ్రమం ఏర్పేడు(చిత్తూరు జిల్లా కాళహస్తి వద్ద నేటికీ ఉన్నది)లో తపస్సు చేసుకుంటున్నారని విని, ఆయన దర్శనం చేసుకోవాలని ఉత్సుకతతో అక్కడికి చేరుకున్నారట.
మలయాళస్వామివారి దర్శనం
శ్రీ మలయాళస్వామికి శిష్యులు సుమారు 50 మంది అప్పటికే వారి వెంట ఉన్నారు. బాలుడైన రామచంద్రయ్య అక్కడికి చేరేసరికి కుండపోతగా వర్షం కురుస్తోంది. శిష్యులతో ‘‘పూజకు ఆవుపాలు తీసుకురాగలరా?’’ అని అడిగితే వారెవ్వరూ మాటాడలేదట. అప్పుడు రామచంద్రయ్య శిష్యులను ఆవుపాలు దొరికేచోటు అడిగి తెలుసుకుని, తాను తీసుకువస్తానని చెప్పి బయలుదేరారట. చీకటిలో అక్కడివారిని దారి అడిగి, ప్రవహిస్తున్న ఏరు దాటడం కష్టమని ఎంచక, ఒక చెట్టుకొమ్మకు వేలాడుతూ అవతలి ఒడ్డుకు చేరి, తిరుగు ప్రయాణంలో అదే కొమ్మపైకెక్కి చెట్టు దిగి, ఆవుపాలు గురువుగారికి అందించారట. అంతట ఆయన ‘‘ఎవరుబాబూ! ఎక్కడి వాడవు?’’ అని ప్రశ్నించగా ‘‘నైజాము వాడను. ఆవుపాలు కోరిన మీ కోరిక తీర్చుటకు శిష్యులు ఎవరూ ముందుకు రానందువలన సాహసించి మీ ఆశీస్సుతో పాలు తేగలిగాను’’ అని తాను పాలు తెచ్చిన విధానాన్ని తెలుపగా, స్వామి సంతోషించి దగ్గరకు పిలిచి ఈతనికి ఎన్నియో వేదాంత రహస్యాలు బోధించడానికి అక్కడనే వారం రోజులు ఉంచుకొన్నారట. తరువాత ఇంటికి వచ్చి ప్రతినిత్యం వైశ్వదేవం చేస్తూ కారం మాని సాత్వికాహార నియమంతో వీరెందరికో తత్త్వబోధ చేసేవారు. వీరెంతటి సాధుహృదయులంటే తనకు తప్పక కోపము కలిగించే విషయం వస్తే తప్ప కోపమెరుగనివారు.
క్రుధ్యంతం నప్రతిప్రకుధ్యేత్, అవృష్టః కుశలం వదేత్ ।
సప్తద్వారావ కీర్ణంచ నవాచ మనృతం వదేత్ ।। (మను 6.48)
దూషితో పి చరేద్ధర్మం యత్రతతోశ్రమేరతః ।
సమః సర్వేషు భూతేషు నలింగం ధర్మ కారణమ్ ।। (మను 6.66)
అను శాస్త్ర వచనాను జీవనం గడుపుతున్న వీరు స్థానికుడైన శ్రీ బిదురు లక్ష్మయ్యతో పౌరోహిత్యంలో వివాదపడడం ఇష్టం లేక తనకై కట్టించుకున్న ఇంటిని సైతం వదిలి అత్తవారింటికి చేరారు. అక్కడ భార్యతో ఇద్దరు కొడుకులతో అత్తవారింట ఉండడం ఇష్టంలేక వారింటి ప్రక్కనే ఉన్న విఠలేశ్వర దేవాలయంలో పూజారిగా ఉండి జీవనం గడిపారు. శ్రీ మలయాళస్వామి వారి రచనలైన ‘జీవబ్రహ్మైక్య రాజయోగ సారం, శుష్కవేదాంత తమో భాస్కరము’ అను గ్రంథములను నిరంతరం చదివేవారు. వారి ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రతినెల తెప్పించుకునేవారు. నేనొకమారు ఎన్నో వేదాంత గ్రంథాలుండగా ఈ గ్రంథాలే మిమ్మల్నెందుకు ఆకర్షించాయి అని అడుగగా శ్రీవారితో తన అనుభవాన్ని వెల్లడించారు. ఆయదార్థ భారతిలో గురుస్తుతి, గురుమహిమ అను శీర్షికలతో (1962లో)నా పద్యములు కూడా అచ్చయినాయి.
శ్రీ రామచంద్రయ్యగారికి ధ్యానం, పూజ, అనుష్ఠానం మాత్రమే కాదు, మహాత్ములు ఎక్కడ ఉన్నారని తెలిసినా వెంటనే వెళ్ళి వారిని కలుసుకునే దాకా మనసు నిలిచేది కాదు. ఇందుకు కొన్ని సంగతులు వారు తెలియజేసినవి క్రింద పొందుపరుస్తున్నాను.
వరంగల్ జిల్లా చుంచనకోట అనే గ్రామంలో శతావధాని బ్రహ్మశ్రీ విఠాల చంద్రమౌళి శాస్త్రిగారను ప్రముఖ దేవీ ఉపాసకులు ఉండేవారు. అక్కడ శ్లేషయమక చక్రవర్తి ఇత్యాది బిరుదాంకితులైన పాదుకాంత దీక్షాపరు లైన బ్రహ్మశ్రీ యాయవరం రామశాస్త్రి గారు (కుకునూరు), ఇస్మాయిల్ఖాన్ పేట వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ కె. రాఘవశాస్త్రిగారు కలిసుకొన్నపుడు అద్భుత వేదాంత విషయాలపై చర్చించుకొనేవారు. వీరి చర్చలో నిద్రాభోజనాలోచనలు మరుగున పడిపోయేవి. చుంచనకోటలో శ్రీ రాజరాజేశ్వరీమాత పాలరాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆర్డరు వేశారు. రాజస్థాన్‌లోని జయపూర్ నుండి విగ్రహం తేవాలి. అప్పుడు నైజాం ప్రభుత్వం కేంద్ర జాతీయ ప్రభుత్వంలో కలవడానికి ఇష్టపడని రోజులు.
నైజాము ఇతవరిగా పేరుపొందిన కాశీం రజ్వీ అనేవాడు రజాకారుల పేరుతో దురాగతాలు చేస్తూ తెలంగాణ ప్రాంతంలో అందునా వరంగల్, మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలలో భయభ్రాంతులు కలిగించేవాడు. రజాకారులు ఎదురు తిరిగిన వారినందరినీ కత్తులతో నరికి, తుపాకులతో కాల్చి చంపేవారు. అప్పుడు కమ్యూనిస్టు నేతలు తీవ్రంగా వారితో పోరాడుతుండేవారు. అటువంటి కాలంలో సామాన్యుడు ఇల్లు దాటి వెళ్ళే పరిస్థితులు లేవు. ఈ విషయం ‘హైదరాబాద్ చరిత్ర – అజ్ఞాతపుటలు’ అనే గ్రంథంలో వివరంగా ఉంది.
‘మహాత్మా’ బిరుద ప్రదానం
ఆ సమయంలో జయపూర్ వెళ్ళి విగ్రహం తేవడానికి ఎవరూ సాహసించలేదు. రామచంద్రయ్యగారు ఈ విషయం విని ‘‘మీరు ప్రతిష్ఠా ముహూర్తం నిశ్చయించి మీ పనులలో ఉండండి, నేను విగ్రహం తీసుకువస్తాను’’ అని ఒక్కడే రైలులో జయపూర్ వెళ్ళి సుమారు 50 కిలోల బరువున్న పాలరాతి విగ్రహాన్ని గోనెసంచిలో కట్టుకొని క్రింద పెట్టకుండా తీసుకురావడం చూసిన వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ బడుగుబాపడేమి? విగ్రహం మోసుకుని తెచ్చుటేమి? అని వింతపడని వారు లేరు. అప్పుడు పెద్దలందరూ ఇది మహాత్ములు చేయవలసిన పని, సామాన్యుల వల్ల కాదని తలచి వీరికి ‘మహాత్మా’ అని బిరుదునిచ్చి గౌరవించారు.
మరుకూకు గ్రామ సమీపంలో శ్రీ అప్పాల నారాయణబాబా అనే భక్తుడు పాండురంగాశ్రమాన్ని నెలకొల్పి అటవీ ప్రదేశమైనా కూడా నిర్భయంగా ఉండి ‘నాదం-సాదం’ అనే నినాదంతో భజన కీర్తనలు, జాగారములు, ప్రతివారికీ భోజనం అనే ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి అనేక శిష్యులు సహాయ సహకారాలందించి వారి కార్యక్రమాలను సజావుగా నిర్వహించే వారు. అందులో ఈశ్వరయ్య అనే వైశ్యులు, శ్రీ రుక్మాభట్ల విధుమౌళిశాస్త్రి (తందనాన రామాయణకర్త), ఆకెళ్ళ సుందరశాస్త్రి, గౌరీభట్ల రఘురామశాస్త్రి మొదలగు బ్రాహ్మణులు ఉండేవారు.
నారాయణ బాబాకు సన్యాసదీక్ష ఇవ్వడం
శ్రీ నారాయణబాబా గారికి సన్యాస స్వీకారమునకు పాండురంగని ఆజ్ఞ అయినదట. సన్యాసమిచ్చు వారు నీకడకే రాగలరు. నీవు సకల సంభారములు సిద్ధపరచుకొమ్మని సెలవిచ్చినారట. బాబాగారు తమ శిష్యులతో ఈ విషయం తెలియజేసి సర్వసన్నద్ధులై ఉన్నారు. స్వభాను నామ సం.ర వైశాఖ శుద్ధ ఆదివారం (9.5.1943) నాడు అన్నీ సిద్ధపరచుకున్న బాబాగారిని కౌతుకముతో ఎందరెన్ని విధముల ప్రశ్నించినా నాకు కృష్ణుడిచ్చిన ఆజ్ఞ సత్యమైతే ఇదీ సత్యమే అని దృఢనిశ్చయం తెలిపారట. మహాత్మా కాసుల రామచంద్రయ్య గారు (అప్పటికి వారి వయస్సు 34 సం.లు) సిద్ధిపేట నుండి హైద్రాబాదు బస్సులో వెడుతున్నారు. బస్సు గౌరారం (సిద్ధిపేట నుండి 50 కి.మీ.) రాగానే బస్సు దిగి మరుకూకు వెడుతున్నట్లు తెలుపగనే వెంట ఉన్నవారు ఆశ్చర్యపడి దిగి వారిని అనుగమించారు. వీరు ఆశ్రమం చేరుకునే సరికి మధ్యాహ్నం కావస్తున్నది. బాబాగారు పూర్తి నమ్మకంతో ఉన్నారు. రామచంద్రయ్యగారికి అక్కడి విషయమేమీ తెలియదు. కాలినడకన (10 కి.మీ. దూరం) వచ్చి చూసేసరికి పరిస్థితి తెలిసింది. బాబాగారి సన్యాస స్వీకార మహోత్సవానికి రాగలగడం అదృష్టంగా భావించారు. యాజ్ఞికులు పూర్వరంగమంతా పూర్తి చేసి బాబాగారి వైపు చూశారు. బాబాగారు ‘‘మహాత్మా! రామచంద్రయ్యగారు నాకు కృష్ణుడు పంపిన గురువు. నాకు సన్యాసదీక్షనీయవలసినవారు. సకాలానికి విచ్చేసి నన్ను ధన్యుని గావించారు’’ అని అన్నారు. ఒక గృహస్థు సన్యాసదీక్ష ఇచ్చుటయేమి? సన్యాసియే సన్యాసదీక్షను ఈయదగినవాడు. ఇదేమి విపరీతము అని ఎవరికి వారు నోరు నొక్కుకొను సమయమున బాబాగారు, మహాత్మా రామచంద్రయ్యగారిని స్వామి ఆదేశంగా మనవి చేసి దీక్షనీయగోరారు. అందరూ వింతగా చూస్తుండగా మహాత్మా రామచంద్రయ్య గారు భగవదాజ్ఞను నిర్వర్తించదలచి బాబాగారికి సన్యాసదీక్షనిచ్చి భావానందులను దీక్షానామా న్నిచ్చారు. మహా వైరాగ్య పరిపూర్ణుడైన వ్యక్తికి (అందునా వయసున పెద్దవాడైన వానికి) ఒక గృహస్థుడు సన్యాసదీక్ష నిచ్చుట అనిదఃపూర్వమని శ్లాఘించుటయే గాక వారెంత మహాజ్ఞానులో తేటపడినదిగా సంతోషించారు.
‘‘పరీక్ష్య లోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నాస్త్య కృతః కృతేన, తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్ఛేత్, సమిపౌణిం శోత్రియం బ్రహ్మనిష్టమ్’’ (ముండకోపనిషత్తు 1-2-12)
లౌకిక భోగాలన్నీ కర్మ సంచితాలని కనుగొని వైరాగ్యాన్ని పొందిన బ్రాహ్మణుడు శోత్రియుడై బ్రహ్మనిష్ఠుడైన గురువును ఆశ్రయించాలని ముండకోపనిషత్తు తెలుపుచున్నది. కాబట్టి గురువు శోత్రియుడై బ్రహ్మనిష్ఠుడై ఉండాలే కాని సన్యాసియై ఉండాలని నియమమేమీ లేదు. ఈ విషయం ద్వారా కాసుల రామచంద్రయ్యగారెంత బ్రహ్మనిష్ఠులో తెలియుచున్నది కదా!
వీరు ఎక్కువ కాలం ధ్యానమగ్నుడై ఉండడమే కాదు యోగ సమయంలో పద్మాసనాశీనులై భూమినుండి రెండడుగుల ఎత్తునకు లేచి ఉండేవారట. దాని నిజానిజాలు నేను 13 ఏళ్ళ వయసులో వీరిని సైకిలుపై ఎక్కించుకుని బస్సు ఎక్కించడానికి వెళ్ళినపుడు నాకేమంత్రం బరువు లేకుండా వారు కూర్చోవడం ప్రత్యక్షానుభవం. వీరు మహాత్ములు ఎక్కడ ఉన్నారని తెలిసినా వారిని కలిసే అవకాశాన్ని ఉపయోగించుకునేవారు.
మూఢానందస్వామి వారి దర్శనం
ఒకసారి హైదరాబాదులో గౌలిగూడా బస్‌స్టాండు సమీపంలో నడుస్తుండగా పిచ్చివానివలె లోకానికి తోచే మహనీయుడొకరు వీరి కంటపడ్డారు. చంకలో సారాయి సీసాతో వెడుతున్న ఆ వ్యక్తిని వెన్నంటి కొంతదూరం వెళ్ళగా ఒక పెంటదిబ్బ ప్రక్కన కొందరు పేకాట ఆడుతున్నారు. వారి ప్రక్కన ఉన్న చిన్న సొరంగ మార్గం గుండా లోనికి ఆయన వెంట రామచంద్రయ్యగారు వెళ్ళారు. అక్కడ ఉన్న కొందరు పరిచారకులతో, మాసిన గడ్డాలతో, వంకరలు తిరిగిన గోళ్ళతో ఉన్న ఆ మహనీయుని పేరేమిటని అడగ్గా మూఢానందస్వామి అని వారు బదులిచ్చారట. ఆయన వయస్సు 300 ఏళ్ళని అంటారు. చేతులు కట్టుకుని వారి ముందు నిలుచున్న రామచంద్య్రగారిని స్వామి చూచి, నవ్వి, ‘‘మేరే పాస్ క్యా హై, మై దారూ పీతాహూఁ. అగర్ లియేతో దారూ దేతాహూఁ’’ అనగా రామచంద్రయ్యగారు ‘‘ఆప్ జో దియేతో వహీ లేతాహూఁ’’ అని గోకర్ణాకారంగా తీర్థానికి పట్టినట్టు అరచేయి పట్టగా శ్రీ మూఢానందస్వామి సీసా వంచి కొంచెం పోశారు. ఆ సారాయి రామచంద్రయ్యగారి చేతిలో పడగానే ఆవుపాలుగా మారిపోగా వారు స్వీకరించారు. మూఢానందస్వామి నవ్వి రామచంద్రయ్యగారిని ‘‘తుమ్ మహాన్ హో, జావో’’ అని అన్నారట. దీనిని బట్టి రామచంద్రయ్యగారు ఎంతటివారో అర్థమవుతోంది గదా!
గ్రామంలో విఠలేశ్వరాలయంలో ప్రతిరోజూ ఏకాదశ రుద్రాభిషేకం, అతిథి, అభ్యాగతుల సేవ చేస్తున్న కాలంలో షిరిడీ సాయిబాబా శిష్యులలో ఒకరైన ఉపాసనీ బాబాగారు హైదరాబాదుకు అప్పటికే ప్రసిద్ధ న్యాయవాదియైన బూర్గుల రామకృష్ణారావుగారి ఆహ్వానంపై వచ్చారు. ఉపాసనీబాబా గారిని చూడడానికి వెళ్ళిన రామచంద్రయ్యగారికి న్యాయవాదిగారి మందీ మార్బలం మధ్య బాబాగారి దర్శనం అతికష్టం మీద కలిగింది. వారు దిగంబరులు భుజముపైన ఒక గోనెపట్టా మాత్రం వేసుకొనేవారు. రామచంద్రయ్యగారిని దగ్గరికి పిలిచి ‘‘తుమ్ రాత్ మే బారాబజేకే బాద్ మిలో’’ అన్నారు. అలాగే రాత్రి 12 గం.లకు కలిసిన పిదప అందరితో ‘‘మై ఆజ్ అసలీ పురుష్ కో దేఖా హూఁ‘‘ అని సంపూర్ణంగా ఆశీర్వదించారట. ఆ తర్వాత వీరు కఠోర సాధన చేశారు.
యవాపురం (గజవెల్లి తాలూకా) రాజయ్యగారు మహాశక్తి ఉపాసకులు. వారిని కలవడానికి వెళ్ళినపుడు వారు వేపాకు తింటూ సాధన చేస్తున్నారు. అది చూచి వచ్చి తానూ వేపాకు ఆహారంగా తీసుకున్నారు. యోగదీక్షలో వీరి శరీరం ఉష్ణప్రకోపం చెందిందట. వెంటనే దానిని మాని నాటి నుండి సాత్త్వికాహారం తీసుకునేవారు. ఒక్క మిరపగింజను కూరలో గుర్తుపట్టేంత సాత్త్వికాహారము తీసుకునేవారు. ఒక సంవత్సరం కేవలం దోసెడు పేలాలు మాత్రమే తిని జీవితం గడిపేవారు.
తమ మామగారు తమకిచ్చిన పొలము ఊరికి దూరంగా ఉండడమే కాక ఒక జాగీర్దారు గారికి దగ్గరగా ఉండేది. ఆ జాగీర్దారు ఒకసారి వీరిని కలిసి ‘‘అయ్యా! మీ భూమి నా భూమికి కలిసియున్నది. అది నాకిచ్చిన దానికి ఐదు రెట్లు కుష్కీ (మెట్ట) భూమిని వాగు ఒడ్డున మీకిస్తాను’’ అన్నాడు. సరే దగ్గరగా ఉంటుంది గదా అని అటవీప్రాంతంగా ఉన్న ఇరవయ్యైదు ఎకరాలు తీసుకుని అత్తవారిచ్చిన భూమిని జాగీర్దారుకు ఇచ్చారు. ఈ మార్పిడి వల్ల ఒక ఆశ్రమం, ఒక ఆలయం కావలసియున్న సంగతి ఉభయులూ ఊహించి ఉండరు.
హరిద్రానది ఒడ్డున రెండు ఎకరాలు పొలము చేసి, వాగు కాలువ (కోలు) ద్వారా పంట పండించే ఏర్పాటు చేసుకున్నారు రామచంద్రయ్యగారు. పుట్టింటి పొలాలు, అత్తింటి పొలాలు వదిలి జాగీర్దారు భూమిలో ఉండవలసి రావడం విధినిర్ణయంగాక ఏమిటి? ఇంతలో తమ అన్నగారైన నరహరిగారు చనిపోవడంతో అప్పటికి పెళ్ళయిన ముగ్గురు పెద్దవారైపోగా చిన్నవారైన నాలుగవ కూతురు, ఇద్దరు కొడుకులను కూడా పోషించే బాధ్యత పైన వేసుకున్నారు. ఎవరెన్ని చెప్పినా తమ సంకల్పాన్ని మార్చుకోవడం వీరి జీవిత చరిత్రలో కనబడదు.
తమ కుమారులు చి. గోపాలక్రిష్ఠయ్య, చి. దత్తయ్యలతో సమానంగా అన్న కూతురు చి. కమలను, అన్న కుమారులు చి. సీతారాముడు, చి. రఘురాముడు అనే వారికి కూడా విద్యా బుద్ధులు చెప్పించి ఉపనయన వివాహాదులు స్వయంగా చేశారు.
ఆశ్రమ స్థాపనకు సంకల్పం
అంతకుముందే తన భూమితో వాసర సరస్వతి ఆదేశించిన రీతిగా ఆశ్రమ స్థాపనకు నిశ్చయించుకున్నారు. వ్యయ నామ సంవత్సర చైత్ర మాసంలో ఆశ్రమానికి ముహూర్తం గావించి సకల సౌకర్యాలు గల నిర్మాణం చేశారు. దానికి సీతారామాశ్రమం అని నామకరణం చేశారు. సర్వజిత్తు సం.ర జ్యేష్ఠ మాసంలో శుద్ధ ద్వితీయ నాడు నది ఒడ్డున కట్టుకున్న ఆశ్రమంలో ప్రవేశించారు. తాను మందిరంగా ఏర్పరచుకున్న ఒక గదిలో సీతారామలక్ష్మణ హనుమన్మూర్తులకు (ఇత్తడివి) పూజాదికాలు నిర్వహించేవారు. ఇప్పటికీ అవే మూర్తులు వారు నిర్మించిన దేవాలయంలో ఉత్సవమూర్తులుగా ఉన్నాయి. వానికే కళ్యాణాది మహోత్సవములు నేటికీ జరుపబడుచున్నవి.
తన అన్నగారి చివరి కూతురు వివాహంతో అష్టకాల వారితో బంధుత్వం ఏర్పడింది (1951). అప్పటి నుండి అష్టకాలవారి ఆడపడుచు శ్రీమతి యల్లంభట్ల రామలక్ష్మమ్మగారు పతి వేరొకరిని పెళ్ళియాడుట కారణంగా మహాత్ముని వద్ద ఉపదేశం తీసుకొని వారి సేవలో కాలం గడపడానికి ఆశ్రమానికి వచ్చింది. ఆమెయే వారికి జీవితాంతం కన్నతండ్రికి చేసినట్లు సేవలు చేసింది. రామచంద్రయ్యగారి ధర్మపత్ని శ్రీమతి రాజమ్మగారు మరణించడం, పెద్దకొడుకు, కోడలు సికిందరాబాదులో ఉండవలసి రావడంతో వారి సేవలో ఆమె బాధ్యత పెంచుకున్నది. 1957లో హేవళంబి నామ సం.ర చైత్ర బహుళ ఏకాదశి రోజున సీతారామాశ్రమంలో నిర్మించిన రామాలయంలో శివపంచాయతనం, రాజేశ్వరీదేవి, హనుమత్సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాలు ప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగింది. జీవితాంతం వారు, వారి చిన్న కుమారుడు పూజాదికాలు స్వయంగా నిర్వహించేవారు.
ఏ వస్తువు అవసరమైనా మాసాయిపేట గ్రామానికి రావలసిందే. ఆశ్రమానికి ఏ వైపు నుండి కనీసం బండిబాట కూడా లేదు. పొలాల గట్లపై నుండి నడిచి వాగు దాటి ఆశ్రమానికి చేరాలి. 2005లో వారి శతజయంతి సందర్భంగా శిష్యులు రోడ్డు వేయడానికి శ్రమించారు. ప్రభుత్వ సహాయంతో మట్టి రోడ్డు వేయించారు. అంటే అప్పటికి 49 ఏళ్ళు దారిలేని కాలిబాటలోనే నడిచారు. అయినా వీరు ఒంటరిగా రాత్రనక, పగలనక తిరిగేవారు. ప్రవహిస్తున్న నదిలో కంఠం లోతులోనైనా నిశ్చింతగా నడిచి వెళ్ళేవారు.
సచ్చిదానందుల నుంచి సన్యాసదీక్ష
‘‘ఆశ్రమా దాశ్రమం గచ్ఛేత్’’ అను సూక్తి ననుసరించి గృహస్థ వానప్రస్థములు చక్కగా నిర్వహించి క్రోధి సం.ర ఆశ్వయుజ బ. దశమి నాడు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహారాజ్ (గుజరాత్) వారి వద్ద సన్యాసదీక్ష స్వీకరించారు. నాటి నుండి వారికి అఖండానంద సరస్వతీ నామం దీక్షానామమైంది. సన్యాస స్వీకారానికి ముందు విళంబి మాఘ శు. దశమి నాడు ఈ వ్యాసకర్తకు ఉపనయనం చేశారు (ఈ వ్యాసకర్త అప్పటికి మాతృ వియోగం పొందారు). తరువాత ప్లవనామ సం.ర అధిక జ్యేష్ఠములో శిష్యునిగా స్వీకరించి తారకముపదేశించారు (1960).
ఏళ్ళ కొలది నిరాహారంగా ఉన్నా దైనందిన కార్యాలను చక్కగా నిర్వహించేవారు. వందలమంది శిష్యులున్నా ఎవరినీ ఏమీ యాచించక భోజనాదులు సమకూర్చేవారు.
ప్రతిరాత్రి జ్ఞానదేవుని భగవద్గీతాసారము, శ్రీ కోయిల్ ధనాల దేవరాజస్వామివారు రాసిన పాండురంగ భక్త విజయంలో ఒక భక్తుని కథ, శుష్కవేదాంత తమోభాస్కరంలో కొన్ని పుటలు, తప్పక శ్రీమతి రామలక్ష్మమ్మగారు చదివి వినిపించినప్పుడు అందులోని విశేషాలను వివరించేవారు. ఉదయం అధ్యాత్మ రామాయణం, భగవద్గీత, సుందరకాండ పారాయణం చేసేవారు. రుద్రాభిషేకం, రామపూజ చేసేవారు. అప్పుడు తమ వద్దకు వచ్చే సాధువులు, సన్యాసులు శ్రీశ్రీశ్రీ పుండరీకాక్ష చంద్రశేఖరానంద సరస్వతీ స్వామి, శ్రీశ్రీశ్రీ జయరామానందస్వామి వంటి వారితో చమత్కార వేదాంత విషయాలలో మునిగి తేలేవారు. భోజన సమయంలో భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ భుజించవలసిందిగా, అలా భుజించువాడు సదోపవాసియని చెప్పేవారు.
కబళే కబళే కుర్వన్ గోవింద స్యాను కీర్తనం
సదోపవాసీ విజ్ఞేయో జీవన్ముక్తో నసంశయః
అనే శ్లోకాన్ని పదేపదే చెప్పేవారు. మధ్యాహ్నం ఎండపూట కొంతసేపు విశ్రాంతి తీసుకుని శిష్యులతో ఇష్టాగోష్టి నెరిపేవారు.
తమ ఆశ్రమం చుట్టూ ఉన్న మెట్టభూమిని మాగాణిగా మార్చి వ్యవసాయం చేయించుటలో చిన్న కుమారుడు దత్తాత్రేయశర్మ చాలా కృషి చేశారు. మొత్తం ఇరవయ్యైదు ఎకరాలలో గుడి, ఆశ్రమం, కూరగాయల తోట మినహా సమస్త స్థలం వరిపైరుతో సస్యశ్యామల వాతావరణం సుందరంగా ఉండి వచ్చిన వారికి ఆహ్లాదం కలిగించేది.
స్వామి సేవ, ధర్మప్రబోధం మొదలైన పనులలో మునిగి వున్న రామచంద్రయ్యగారు ధర్మపత్ని మరణించగానే బంధవిముక్తిగా భావించి హిమాలయాలకు వెళ్ళ నిశ్చయించు కున్నా కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆశ్రమ నిర్వహణను దృష్టిలో పెట్టుకుని అక్కడే ఉండడానికి అంగీకరించారు. కొన్ని సందర్భాల్లో పంటపొలాల్లో వడగళ్ళు పడకుండా కట్టడి చేసేవారు. అడవిలో నివాసమై ఉన్నా, తేళ్ళు, పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నా వాటిని చంపనిచ్చేవారు కాదు. భూమిమీద వాటికి జీవించే హక్కు ఉన్నది. వాటిని చంపే అధికారం మనకు లేదు. వాటి దారిలో వాటిని పోనివ్వండి అనేవారు. అవి మనను మరిస్తే మనం చనిపోతాం గదా అని ఎవరైనా అంటే వాటి దారికి మనం అడ్డుపోతే అవి కరుస్తాయి. అయినా వాటితో కరువబడే యోగమే మనకు ఉంటుందనుకుంటే అది కాకపోతే ఇంకొకటి కరుస్తుంది. బుద్ధిజీవులం మనమే ఆలోచించాలి అనేవారు.
కొందరు దుష్టబుద్ధులు తనపై నిందారోపణలు చేసినా విని ఊరుకునేవారు. దానికి ప్రతిక్రియగా ఏమీ మాట్లాడేవారు కాదు. మనమే జన్మలోనో లేక ఈ జన్మయందేనో తెలియక ఏ తప్పు చేసినామో అతడు శిక్ష విధించాడు అని సమాధానపడేవారు.
యథాగ్రామ విశుద్ధ్యర్థం సూకరాన్ పరికల్పయేత్
తథా దోష విశుద్ధ్యర్థం దూషకాన్ పరికల్పయేత్
అని సంతృప్తిపడేవారు. భూతదయ విషయంలో వీరు మధ్య వయసు నుండి అనేక అద్భుతాలు చేసి చూపించారు.
ఒకనాడు ఒక ఘటసర్పం ఆశ్రమం సమీపంలో లోనికి రాగానే భయపడిన అందరితో ‘‘మీరు భయపడవలసిందేమీ లేదు. అది నలభై రోజులు ఇక్కడ ప్రదక్షిణం చేసి వెడుతుంది’’ అని చెబితే కుటుంబ సభ్యులు దానిని ప్రతిరోజూ చూసేవారు.
ఒకనాడు చేర్యాలలో ఒక బ్రాహ్మణుని ఇంటిలో వారు ధ్యానం చేసుకొంటుండగా ప్రక్క ఇంటిలో (బ్రహ్మశ్రీ శివరామయ్యగారింట) ఒక నాగుపాము వచ్చిందనీ, దానిని చంపడానికి హడావిడి జరుగుతున్నట్లు విని వెంటనే తన ధ్యానమునాపి వారింటిలోకి వెళ్ళి గబగబా ఆ పామును చేత్తో పట్టుకుని తన తొడపై పెట్టుకుని దాని నోటిలోని కప్పను సజీవంగా విడిపించి పాముకు పాలుపోసి విడిచిపెట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
వారి జీవితంలో జరిగిన ఒక అద్భుత విషయం ఒకటి ఉంది. సామాన్యంగా మహాత్ములను సేవించడానికి స్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా శిష్యులు వెంట ఉండడం సహజమే. పురుషుల కంటె స్త్రీలు సేవలో ఓపికగలవారై ఉంటారనుట సత్యమే గదా! వైరాగ్యదృష్టితో స్త్రీలు కొందరు స్వాముల సేవలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అట్లే మహాత్మా రామచంద్రయ్య గారిని కనిపెట్టుకుని ఉన్న శ్రీమతి రామలక్ష్మమ్మ గారు (వ్యాసరచయిత మేనత్త) ఉత్తమ సేవకురాలిగా, శిష్యురాలిగా, శిష్యులందరిచేత అక్కగా పిలువబడుతూ, ఆశ్రమానికి వచ్చిన వారిని మంచి మాటలతోను అతిథి మర్యాదలతోను ఆదరిస్తూ ఉండేది. ఆమె ఏ కారణంచేతనైనా ఆశ్రమంలో లేనిరోజున శిష్యులు కన్నతల్లి చేతిభోజనం లేని అనుభూతిని పొందేవారు.
పండితుడి ధర్మ సందేహం
ఇంతలో ఒకనాడు మెదక్ జిల్లా కుకునూరు గ్రామస్థుడు, శ్లేషయమక చక్రవర్తి బిరుదాంకితులు, మహాకవి, శ్రీవిద్యోపాసకులు, వీరిని మహాత్మా బిరుదిచ్చినపుడు చుంచనకోటలో ప్రత్యక్ష సాక్షియైన బ్రహ్మశ్రీ యాయవరం రామశాస్త్రిగారు మహాత్మా రామచంద్రయ్యగారితో ఏకాంతంగా మాట్లాడుతున్నపుడు ‘‘అయ్యా! నాకొక చిన్న సందేహం. సందేహింపక సమాధానం వినగోరుతున్నాను. ప్రతి మహాత్ముని వెంట ఒక స్త్రీ ఎందుకుండాలి? స్త్రీ మాయయని శక్తియని ఉపదేశించే మహాత్ములే స్త్రీలతో సేవ చేయించుకొనుట ఏం సబబు? దానివలని వారి నిష్ఠకు అవరోధం కాదా? ఇతర శిష్యులు శంకించే అవకాశం లేదా? మీకు ధర్మపత్ని ఉండగా మరో స్త్రీకి సేవచేసే అవకాశమీయడం సందేహాస్పదం కాదా?‘‘ అని ప్రశ్నించారు. అడిగినవాడు సామాన్యుడేమీ కాదు. మహామేధావి, పండితుడు, ఉపాసకుడు కూడా. ఈయనకే ఇలాంటి సందేహం కలిగినప్పుడు ఇక పామరుల విషయ మేమిటి? ఇంతకీ ఇది ఇతని సందేహమా? ఆరోపణమా? ఒకవేళ వీరికి సమాధానమిస్తే వీరిలానే భావించే వారందరికీ నేనెలా సమాధానమీయగలను? అని చింతించి కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగారట.
అప్పుడు రామశాస్త్రికి తలపై వెనుకనుండి ఒక నాగుపాము పడగవిప్పి ఉన్నట్టు స్ఫురించి కంపరం పుట్టిందట. దాని ఛాయ ప్రస్ఫుటంగా తోచి భరింపరాని భయంతో ఒక మహాత్ముని విషయంలో తనకు కలిగిన దురుద్దేశ్య ఫలితమే ఇది కాబోలుననుకొని, అప్పటికప్పుడు ఆశువుగా కొన్ని శ్లోకాలు చెప్పారట. ఒడలంతా చెమటపట్టగా, గద్గదస్వరంతో కవిత చెప్పిన రామశాస్త్రిగారికి ఆ నాగసర్పం వెంటనే తొలగిపోయినట్లనిపించిందట.
ఆ శ్లోకాలలో ఒకటి ఇది.
ప్రకృత్యా దుశ్చేతాభవతు యది పశ్చాత్పరితపన్
సకృద్దాసోస్మీతి ప్రవిమలయతిస్సన్ ప్రణమతి
తథైవైనం ప్రేమ్ణా కలయసి కృపాపూర్ణ హృదయః
క్షమస్వైతాన్మాత్రా చరణ విముఖ స్యాగ ఇహమే ।।
ఈ విషయమై రామశాస్త్రిగారే మహాత్మా రామచంద్రయ్య గారితో సవినయముగా మనవి చేసికొని తప్పు క్షమించమని వేడుకున్నారట.
ఆ తరువాత రామశాస్త్రిగారు గురుస్తుతి పేరుతో శ్లేషకావ్యం మూడు భాగాలుగా రాశారట. ఒక భాగం మాత్రం క్షీరసాగరం అను గ్రామంలో గల పాండురంగ ముద్రాక్షరశాలలో అచ్చయిన గ్రంథమొకటియే ప్రకాశమైనది. మిగతా రెండు భాగములు ఇంకా అచ్చుకాలేదు. నాకు ఉపదేశం చేసేటప్పుడు మహాత్ముల యందు దుర్బుద్ధి ఉండరాదనే సందర్భంలో ఈ విషయాన్ని రామచంద్రయ్యగారే ఉదహరించారు. ‘‘లోకేషణాయాశ్చ విత్తైషణాయాశ్చ పుత్రైషణాయా శ్చామ్యత్థాయాధభైక్ష చర్యం చరంతి’’ అనే శతపథ బ్రాహ్మణ వచనానుసారం జీవించిన రామచంద్రయ్యగారు శిష్యవత్సలులు.
ఘోరం ఆగిందిలా…
పాలమాకుల గడీలో (కోట) శ్రీ హేమాద్రిరావు దొరవారు నవరాత్రములు చేయుచుండగా వారింటికి రామచంద్రయ్య గారు విచ్చేసియున్నారు. చుంచనకోట నుండి శ్రీ విఠాల చంద్రమౌళి శాస్త్రిగారు, శ్రీ నారాయణబాబాగారు కూడా వచ్చారు. రాత్రికి పూజ జరుగుతున్న సమయంలో ‘‘మీ ఎదురింటిలో ఒక ఘోరం జరగబోతున్నది. మీరు దేనికైనా సిద్ధమంటే ఆ ఘోరాన్ని ఆపుతాను’’ అన్నారట. దొరవారభయ మీయగా, ‘‘మీ ఎదురు కోమటి రామచంద్రం కాశీకి వెళ్ళి క్షుద్రవిద్య నేర్చుకుని వచ్చి ఈ రాత్రి తన కొడుకు మీదనే ప్రయోగిస్తున్నాడు. అతనిని నిరోధించకపోతే ఆ అబ్బాయి జీవితం వృథా అవుతుంది’’ అని పరుగున వచ్చి తలుపులు వేసి ఉండగానే వాని ఇంట్లో ప్రవేశించి వాడి జుట్టు పట్టుకొని లెంపకాయ కొడితే వాని రెండు పళ్ళూ ఊడాయట. దంతహీనునికి మంత్రశక్తి పనిచేయదట. అందరూ ఆశ్చపడ్డారట.
ఇంకొకసారి రామచంద్రయ్యగారు కడవెర్గులో నివసిస్తున్న శ్రీ రాజయ్యగారి ధర్మపత్ని ల.సౌ. సరోజనమ్మకు చేతబడితో గ్రహబాధను (10 సం.ల నుండి బాధపడుతున్న) అనుభవిస్తున్న దానిని శ్రీ సాంద్రానంద స్వామి సూచన మేరకు మంత్రజలాన్ని చల్లి గ్రహబాధా విముక్తిరాలిని చేశారు. నాటి నుండి ఆమె ఆరోగ్యంగా ఉంది.
మరొకసారి ధూల్మిట్ట గ్రామంలో శ్రీ వెంకటకిష్టయ్యగారి కూతురు చి. బాలమ్మకు వివాహంలో బైరాన్‌పల్లి వాస్తవ్యురాలైన పార్నంది సుశీలమ్మగారికి ఆవేశం వచ్చి కేకలు పెడుతుంటే రామచంద్రయ్యగారు లేచి ఎవరిదో చెప్పు తీసుకొని రెండు దెబ్బలు వేయగానే ఆమెకు గ్రహబాధా విముక్తి జరిగింది. మరునాడు ఆమెకు పంచాక్షరిని ఉపదేశించారు. ఆమె పంచాక్షరి అతిగా జపించేది. ఒకనాడు పంచాక్షరీ జపం చేస్తున్నప్పుడు ఆమెపై నాగుపాము పాకుతున్న బాధ కలిగిందట. ఆ బాధ భరించలేక గురువుగారిని కలవడానికి పోతే ఆమె బాధనెరిగి కొంత భస్మాన్ని మంత్రించి ఇచ్చి ఒళ్ళంతా పూసుకొని జపం చేసుకొమ్మని చెప్పారట. నాటి నుండి ఆమెకు ఆ భీతి పోయింది. గురువుగారు అనుమతించిన మేరకే జపించాలి గాని మితిదప్పిన ఇట్టి పరిస్థితులే వస్తాయని చెప్పారట. వైద్యంలోని చిన్న చిట్కాలతో పరిసర గ్రామాలవారికి చికిత్స చేసేవారు కూడా.
మరొకసారి మర్రిముచ్చాలకు శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ స్వామి, శ్రీశ్రీశ్రీ అఖండానంద సరస్వతీ స్వామి విచ్చేశారు. శ్రీ సాంద్రానంద స్వామితో కలిసి కొడవటూరు సిద్ధేశ్వర లింగాన్ని దర్శించడానికి వెళ్ళారు. ఆ కొండపై సుమారు 500 మెట్లు ఎక్కి గుండంలో స్నానం చేయ సంకల్పించారు. అప్పటికి శ్రీ అఖండానంద సరస్వతీ స్వామివారికి కంటిచూపు తగ్గింది. వారితో పాటు తానూ వస్తానని ‘‘స్వామీ! మీ కంటిచూపు తక్కువ. అంతేకాదు మీరశక్తులు, కొండ ఎక్కలేరు’’ అన్నా వారి వెనుక బయలుదేరిన స్వామివారు వీరు కొండ ఎక్కేవరకే వీరికన్న ముందే స్నానం చేయడాన్ని చూసి తమకాశ్చర్యం కలిగిందని శిష్యులతో చెప్పారట.
శ్రీ స్వామివారికి ఒకసారి రుద్రయాగంలో లడ్డూ బూందీతో భిక్ష ఇచ్చారట. అది తింటూ ‘‘నాయనలారా! ఈ లడ్డూబూందీ అందరికీ అందేటట్టు లేదు. అందుకే ఇది చేదుగా ఉన్నది’’ అన్నారట. అది ఏ కొద్దిమందితోనే అయిపోయిందట.
పూర్వాశ్రమంలో ఒకసారి మర్రిముచ్చాలలో శివకోటి కార్యక్రమానికి శ్రీరామచంద్రయ్యగారు అధ్యక్షత వహించారు. విశేష అన్నదానం జరిగింది. బ్రాహ్మణులు దక్షణి ఇవ్వలేని పరిస్థితి వస్తే సాంద్రానందస్వామి అంతా శివుడే చూసుకుంటాడు అన్నారట. వెంటనే రామచంద్రయ్యగారు ఆవేశంలో ఎవరినో పిలిస్తే కొందరు సాహుకార్లు వచ్చి దక్షిణలు ఇచ్చి వెళ్ళారట.
అమ్మ అండతోనే ఆలయం…
ఇక నా అనుభవాన్ని వివరిస్తాను. ప్లవ నామ సం.లో ఉపదేశం పొంది వాసరలో (16వ ఏట) శ్రీ సరస్వతీ సన్నిధిలో తపస్సు చేసిన పిదప ఇరవయ్యేళ్ళ తరువాత తనకు అమ్మగారు దేవాలయం నిర్మించనాజ్ఞాపించినదని, అది నెరవేరుతుందా? అని గురువుగారిని ప్రశ్నించాడు. వారప్పుడు ‘‘ఈ ఆజ్ఞ ఇప్పటిది కాదు. ఇరవయ్యేళ్ళ క్రితమే ఇచ్చినది. నాకిప్పుడు చెప్పుచున్నావా?’’ అని ప్రశ్నించి ‘‘నీతో ఆలయాన్ని అమ్మయే నిర్మింప చేసుకుంటుంది. నీవు నిమిత్తమాత్రుడవు. నీయాలయము పూర్తయ్యే వరకు నేను జీవించి ఉంటాను’’ అని అభయమిచ్చారు.
‘‘నిర్ధనుడనైన నాతో ఆలయ నిర్మాణం అసంభవం’’ అని మనవి చేసిన నాతో ‘‘అమ్మ అండ ఉండగా నీవు నిర్ధనుడవెట్లవుతావు? అయినా ఆలయ నిర్మాణం అమ్మ అవసరమే గానీ నీ ఉపాసనకు ఆలయ నిర్మాణం అవసరం లేదు. కావున తన పని తానే చేయించుకుంటుందని సెలవిచ్చారు. ‘‘ఎక్కడ నిర్మించబూనుకోవాలి?’’ అని అడిగితే అంతా అమ్మయే చూపిస్తుంది. నీవు నిశ్చింతగా ఉండుమన్నారు.
ఆలయ స్థలము స్వప్న దర్శనము చేయగా నాలుగు సం.ములు వెదికి ఆ స్థలాన్ని చిక్కబట్టుకొని ఆ స్థలాన్ని పరిశీలించుటకు శ్రీ అఖండానందస్వామివారిని కోరడం జరిగింది. అప్పటికే మోతే బిందువులు వచ్చి రెండు కన్నులు కనిపించని స్వామి ‘‘కన్నులు కనిపించని నేనేమి చూడగలను నాయనా!’’ అన్నారు.
మీరు చూస్తేగాని నేను ఆలయ నిర్మాణాన్ని ఆరంభించను అన్నాను. అయితే నీవు ముహూర్త నిశ్చయం చేసుకొమ్మని చెప్పి హైదరాబాదుకు వెళ్ళి డా. యాదగిరిరావు గారిని కలిసి తనకొక కంటికి శస్త్రచికిత్స చేయమని అడిగారు. ‘‘స్వామీ! మీకు రక్తము తక్కువగా ఉన్నది, రక్తము నెక్కించినను నిలుపుకునే శక్తి మీ నరాలకు లేదు. కావున శస్త్రచికిత్స కూడదు, ప్రమాదము’’ అన్నారు.
అప్పుడు స్వామి ‘‘డాక్టరుగారూ! ప్రమాదమంటే కంటికా ప్రాణానికా?’’ అని అడిగారు. ‘‘ప్రాణానికి కాదు కంటికి’’ అని అంటే కనిపించని కన్ను ఉన్నా, పోయినా ఒకటే. మా శిష్యుడు ఆలయం కట్టబోయే స్థలాన్ని చూడాలి. మీరు ఆపరేషన్ చేయండి’’ అని ఒత్తిడి చేశారు.
ఆపరేషన్ తర్వాత వీరికంటిలో వేయివోల్టుల వెలుగు కనిపించిందట. అతిశ్రమతో వారిని నిర్మాణ స్థలానికి తీసుకునివెళ్ళాం.
దీపాన్ని కాపాడిన గురువు
సుముహూర్త సమయానికి (రౌద్రినామ సం.ర వైశాఖ బ. విదియ శుక్రవారం తేదీ 2.5.1980) దీపారాధన చేయగానే దీపమారిపోయింది. రెండవసారి కూడా అట్లే జరిగింది. అక్కడికి వచ్చిన సుమారు 200 మంది భక్తులు అనుమానిస్తుండగా ‘‘తల్లీ! ఆలయాన్ని కట్టి నిన్నిక్కడ ప్రతిష్ఠ చేయాలనే కోరిక నాకు లేదు. నీ సంకల్పంతోనే నేను గుర్వాజ్ఞతో ఆరంభిస్తున్న నాకీ అపశకునము లేమి? ఇక మూడవసారి దీపమంటించగనే ఆరిపోయినచో నీవిక్కడ లేవని భావించి ఇక ఆలయ నిర్మాణం చేపట్టనని ప్రమాణం చేస్తున్నాను’’ అన్నాను.
వెంటనే ‘‘గాలిలో దీపం పెట్టి అమ్మా! నీ దయ అన్నట్లుంది నీ వ్యవహారం. సరే అంటించు’’ అన్నారు. దీపం ఆరిపోలేదు. తర్వాత స్వామిని భిక్షకు రమ్మని పిలిచాం. ‘‘నీవు దీపం ఆరిపోతే గుడికట్టనన్నావు గదా! ఆ దీపాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది. నాకీ రోజు భిక్ష వద్దు. నేనిక్కడ కూర్చుని దీపాన్ని రక్షిస్తుంటాను’’ అన్నారు. నిజానికి దీపానికి పది అడుగుల దూరంలో కూర్చుని దీపం ఎలా కాపాడుతున్నారో చూసిన వారంతా ఆశ్చర్యమగ్నులయ్యారు. గాలిలో దీపాన్ని ఏడు గంటలు వెలిగేటట్టు చేశారు. అంతేకాదు. నీ దేవాలయం నిర్మాణం పూర్తయ్యేవరకూ పదేళ్ళయినా కొన ఊపిరితో జీవించి ఉంటాను అని మాట ఇచ్చి వెళ్ళారు. నెలలో వారి చూపు పోయింది.
31.1.1990 శుక్ల మాఘ శుద్ధ పంచమి నాడు ముహూర్తం నిర్ణయించి వారి ఆశీస్సుకై వెళ్ళి ‘‘నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదు స్వామీ! ప్రతిష్ఠ అప్రతిష్ఠ అవుతుందేమో’’ అని ప్రార్థించాను. స్వామి మంత్రాక్షతలిచ్చి ‘‘ఇవి జేబులో పెట్టుకొని బయలుదేరు. కార్యం సానుకూలమవుతుంది’’ అన్నారు. ప్రతిష్ఠ దిగ్విజయంగా జరిగింది. సుమారు యాభైవేల మంది సమక్షంలో అద్భుతంగా జరిగింది.
తరువాత మూడు నెలల లోపే శ్రీ స్వామివారు 17.4.1990లో ప్రమోద నామ సం.ర చైత్ర బ. సప్తమి నాడు సిద్ధిపొందారు. ఇప్పటికీ చైత్ర బ. సప్తమి నాడు వారికి వార్షికారాధన జరుపబడుచున్నది. గురువుగారి కంటి శస్త్రచికిత్స తరువాత సీతారామాశ్రమంలో జరిగిన నా అష్టావధానంలో చెప్పిన పద్యమిది.
ఆనందమ్మున బొంగులెత్తెడిని రామా! మామకానంద సం
ధానమ్మౌ యవధానము న్గనుటకే నా సద్గురుండై అఖం
డానందున్నిజదృష్టియుక్తినిగజేయన్ గుండె విప్పార్చితీ
వీనాడందుల కంజలించెదను దండ్రీ! ధన్యవాదమ్ములన్
శ్రీ అఖండానంద సరస్వతీ పాదపూజ, అష్టకం ప్రార్థన రచించాను. అవి స్వామివారి జయంతి ఉత్సవంలోను, సమాధి సమారోహమందును పూజలో వినియోగింపబడటం నా అదృష్టం.
మాతా రామో మత్పితా రామచంద్రః
భ్రాతా రామో మత్సఖారాఘవేశః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం దైవం నైవ జానే నజానే
అని నమ్మి ఎందరినో శిష్యులను తరింపజేసిన శ్రీశ్రీశ్రీ అఖండానంద సరస్వతీ స్వామిని గూర్చి నేను రాసిన పద్యమిక్కడ ఉదాహరణీయమే యనుకొందును.
కుకునూరుపల్లి కొనగూడుకీర్తి తొలంగి
మాసాయిపేటకు వాసి గూర్చె
కాసుల పేరాస కలలోన దలచక
వాసన విడిచి సన్యాసియయ్యె
గార్హస్థ్యమున నుండగానె సన్యాసికి
ఆశ్రమ దత్తత ఖ్యాతి వడసె
తామరాకున నీరు దాకని వడుపున
దేహిగా విమల విదేహుండయ్యె
బాధపెట్టుట నేర్వని బోధ గురుడు
సంతతాతిథి సత్కార సంతనుండు
రామచంద్రనామాభినిరతి వహించె
అమలుడౌయఖండానంద యతివరుండు ।।
శ్రీవారి ఆశీర్బలమున జీవితమున ఒక సత్ప్రవర్తకునిగా, అష్టావధానిగా, శ్రీ సరస్వతీ క్షేత్ర నిర్మాతగా, దేవాలయ వాస్తు, జ్యోతిష, భూగర్భజల జ్ఞాన నైపుణ్యము గలవానిగా కీర్తిగాంచగలిగిన నేను వారి చిరస్మతికి, వారి ఆదేశమున పాండురంగ భక్త విజయములోన శ్రీ తుకారాము స్వామి చరితమును పద్యకృతిగా 747 గద్యపద్యములతో బంధ, చిత్రగర్భ కవిత్వ బంధురముగా రచించి వారి కంకితమిచ్చి ధన్యుడనయ్యాను.
సీతారామాశ్రమస్థ శ్రీ గురుమూర్తీ అను మకుటముతో స్తుతిచేశాను.
భాగవతార్చనంబు భగవంతుని పూజ, తదీయవాస భూ
భాగము పుణ్యతీర్థము, కృ•పామహితాత్ములు వారు, వారిగా
థాగుణ కీర్తనంబు గుణధాముని విష్ణుని చింతనంబు, దో
షాగ కుఠారమంచు నను హర్షుని జేసె రచించబూనగా (తుకా. 16)
దీనిని రచించుచున్నంత కాలము గురుమూర్తిని తుకారామునిగా భావించి అనంత భక్తి భావ బంధురముగా రచించుట చేత గాబోలు అది భక్తిరసోదాహరణముగా నిలిచినదనుకొందును.
నాకు తారక మంత్రోపదేష్టగానే కాక, (మా తల్లిగారు నా చిన్నతనముననే మరణించుట చేత) గాయత్రీ మంత్రోప దేశకుడుగా, జీవితమున ననేకాంశముల మార్గదర్శిగా నన్ను వెన్నుదట్టిన గురుదేవులు శ్రీశ్రీశ్రీ అఖండానంద సరస్వతీ స్వామివారికి ఎన్ని విధముల సేవ చేసిననూ ఆ ఋణము ఈ జన్మముతో తీరునది కాదు. వారి అనుగ్రహముతోనే శృంగేరీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి సమక్షమున అష్టావధానము చేసి ఆశీర్వచనం పొందగలిగాను. శ్రీశ్రీశ్రీ పుండరీకాక్ష చంద్రశేఖరానంద సరస్వతీ స్వామివారి జ్యోతిష పరీక్షలో నెగ్గగలిగాను, శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీస్వామివారి హృదయంలో ముద్రగొన్నాను. శ్రీశ్రీశ్రీ శివచిదానంద భారతీ స్వామి (కుర్తాళం జగద్గురువులు) వారికి శ్రీ సరస్వతీక్షేత్ర సమ ర్పణం చేశాను. శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వాముల (కుర్తాళం ప్రస్తుత పీఠాధిపతులు) కరకమలములచే స్వర్ణకంకణ ధారణ సత్కతిని అందుకొన్నాను. మహాశక్త్యుపాసకులు శ్రీ అయిలా వఝల వేంకటరమణయ్యగారి శాక్తదీక్షతో అవధానశక్తిని పొందాను. యజ్ఞవరాహ క్షేత్ర నిర్మాత శ్రీమాన్ శ్రీభాష్యం విజయ సారథి గారి ఉత్తమ శిష్యత్వమును పొందుట నా భాగ్యం.
తీరని చింత ఇప్పటికి సుమారు 100 దేవాలయాల వాస్తు ప్రతిష్ఠా నిర్వాహకునిగా ధార్మిక పథమున సాగు నాకు తీరని చింత ఒకటి మిగిలి ఉంది. అది స్వామివారి సమగ్ర జీవిత చరిత్రను వారి ముఖతః విని రాయలేకపోవడం. అయినా 15-9-2005 నాడు స్వామివారి శతజయంతిని పురస్కరించుకొని ఘనంగా ఎనిమిది రోజులు శిష్యుల, భక్తుల సహకారంతో మహోత్సవాలు నిర్వహించే సందర్భంలో ‘దర్శనమ్’ పత్రిక అధినేత చి. మరుమాముల వేంకటరమణ శర్మ ప్రోత్సాహంతో స్వామిపై ఒక వ్యాసాన్ని ప్రచురింపజేయగలిగాను. తిరిగి ఆంధ్రమహాయోగులు గ్రంథంలోని ఐదవ భాగంలో చేర్చడానికి సవివరంగా వ్రాయ ప్రేరేపించిన డా. రామరాజు గారికి, విషయ సేకరణలో తోడ్పడిన శ్రీ సాంద్రానంద స్వామి కుమారులు శ్రీ గౌరీభట్ల శ్రీనాథశర్మగారికి కృతజ్ఞుడను. సన్నిహితుడై నేను కోరిన తర్వాత కూడా శ్రీ స్వామివారి అనుభవాలను సేకరించడంలో అశ్రద్ధ చేసిన శ్రీ మేడిపల్లి విశ్వనాథ శర్మపై నాకు కొంత అసంతృప్తి ఉంది. అప్పుడప్పుడు నా కుతూహలం కొద్దీ క•న్ని విషయాలు తెలియజేసి ఈ మాత్రం రచనకు దోహదపడిన మా మేనత్త కీ.శే. రామలక్ష్మమ్మకు అంజలి ఘటిస్తున్నాను.
ముక్తాయింపు
సవై శరీరస్య సతః ప్రియాప్రియయో రవహతి రస్తి
అశరీరం వా వసంతం నప్రియాప్రియే స్పశత ।। (ఛాందోగ్య 8-12-1)
దేహధారి సుఖదుఃఖ ప్రాప్తి నుండి దూరం పోజాలడు. శరీర రహితుడైన జీవాత్మ ముక్తి యందు సర్వవ్యాపకుడైన పరమేశ్వరునితో కూడి శుద్ధుడై ఉంటాడు. అప్పుడు వానికి సాంసారిక ప్రియాప్రియ సుఖదుఃఖములంటవు.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః ।
సంన్యాసయోగాద్యతయ శ్శుద్ధసత్వాః ।
తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరావృతాః
పరిముచ్యంతి సర్వే ।। (ముండక 3-2-6)
అధ్యాత్మ రతి రాసీనో నిరపేక్షో నిరామిషః
ఆత్మనైవ సహాయేన సుఖార్థీ విచరేదిహ (మను 6-49)
యదభావేన భవతి సర్వభావేన నిస్పహః
తదాసుఖ మవాప్నోతి ప్రేత్య
చేహచ శాశ్వతమ్ (మను. 6-80)
పై భావాలతో సన్యాసియైన వాడు ఇహపరాలలో పరమ సుఖాన్ని పొందగలడనే స్మతి సూక్తులకు ఉదాహరణీయులైన శ్రీశ్రీశ్రీ అఖండానంద సరస్వతీ స్వామివారు సదా స్మరణీయులు.
—-అష్టకాల నరసింహరామశర్మ
వైభవంగా అఖండానందస్వామి శతజయంతి ఉత్సవాలు
పరమపావనమూర్తి, ప్రముఖ ఆధ్యాత్మిక తత్త్వవేత్త శ్రీశ్రీశ్రీ అఖండానంద సరస్వతీస్వామి వారి శతజయంతి ఉత్సవాలు మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం, మాసాయిపేట పరిధిలోని హరిద్రా నదీతీరంలో వెలసిన శ్రీ సీతారామాశ్రమంలో వారం రోజుల పాటు వైదిక కార్యక్రమాల సహితంగా వైభవంగా జరిగాయి. శ్రీ పార్ధివ నామ సంవత్సర భాద్రపద శుద్ధ పంచమి తేదీ 8 సెప్టెంబర్ 2005న ప్రారంభమైన ఉత్సవాలు శ్రీ స్వామివారు ఆవిర్భవించిన భాద్రపద శుద్ధ ద్వాదశి వరకు అశేష భక్తజనానికి ధార్మిక ప్రేరణలు అందిస్తూ కొనసాగాయి.
ప్రసిద్ధ వైదికవేత్త, వేదధర్మ వికాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రముఖులు శ్రీ మాడుగుల మాణిక్య సోమ యాజులుగారి ఆధ్వర్యంలో స్వస్తి వాచనంతో శతజయంతి ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. ఉత్సవాల్లో సంకల్పించిన చతుర్వేద పారాయణాలు, శ్రీమద్రామాయణ, శ్రీ ఆధ్యాత్మ రామాయణ, శ్రీమద్భాగవత, శ్రీ గురుచరిత్ర, శ్రీ చండీ సప్తశతీ పారాయణాలు అదేరోజు ప్రారంభ మయ్యాయి. వేదమూర్తులు శ్రీయుతులు పాండురంగశర్మ, చంద్రకాంతశర్మ, సిద్ధరామశర్మ, సీతారామశర్మ, కేదారనాథశర్మ, గిరీష్ పండిట్, గోపాలకృష్ణశర్మ, మొకిరాల ప్రభాకరశర్మ, కృష్ణమూర్తిశర్మ, కుల కర్ణీజీ తదితరులు పారాయణదీక్షలు స్వీకరించి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశారు.
భాద్రపద శుద్ధ దశమి తేదీ 13 సెప్టెంబర్, 2005న సార్వజనిక కార్యక్రమాలు, హవనం ప్రారంభమయ్యాయి. అదేరోజు సాయం త్రం సర్వశోభితమైన సభావేదికపై స్మతి సంవర్ధన సదస్సును శతజయంతి సేవా సమితి అధ్యక్షులు శ్రీ అష్టకాల నరసింహ రామశర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి అవతార రేఖ లను పేర్కొంటూ యోగమార్గంలో పునీతులైన మహ నీయునిగా శ్రీ అఖండానందసరస్వతీ స్వామి అవతార రేఖలను అభివర్ణిం చారు. శ్రీ మాణిక్య సోమయాజులవారు ‘వేదధర్మ పరిరక్షణలో సమాజం బాధ్యత’ అనే అంశంపై సోదాహరణంగా ప్రసంగించి, సభికులను ఉత్తేజపరిచారు. ఆ రోజు రాత్రి సుప్రసిద్ధ హరికథా విద్వాంసులు శ్రీ కోట సచ్చిదానందశాస్త్రి గారి శ్రీకృష్ణ రాయబారం కథాకాలక్షేపం ధార్మిక రసధారల్లో ప్రేక్షక శ్రోతలను ఓల లాడించింది. భాద్రపద శుద్ధ ఏకాదశి తిథి 14 సెప్టెంబర్ 2005న యథావిధిగా హవన కార్యక్రమం జరిగింది. ప్రముఖ సంస్క తాంధ్ర పండితులు, ఆర్షధర్మ ప్రవర్తకులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ ‘ధార్మిక జీవనంలో శిరోధార్యమైన అంశాలను సవివరంగా ఉటంకిస్తూ చేసిన ప్రవచనం సభాసదులకు విశేషస్ఫూర్తిని అందించింది. కొడవటూరు శ్రీ దత్తాత్రేయ సిద్ధాశ్రమం నిర్వాహ కులు శ్రీ గౌరీభట్ల రాధాకృష్ణమూర్తి ‘జీవనసాఫల్యం’ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం ‘మహారథి కర్ణ’ హరికథా కాలక్షేపంతో శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి ప్రేక్షక శ్రోతల సమక్షంలో నవరసాలు ఆవిష్కరించి మంత్రముగ్ధులను చేశారు.
ఉత్సవాల్లో ముగింపురోజైన భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు 15 సెప్టెంబర్, 2005న శ్రీ స్వామి శతజయంతి ప్రత్యేక అర్చన కన్నుల పండువగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ధార్మికవేత్తలు, భక్తజనులు సభక్తిపూర్వకంగా శ్రీస్వామి అర్చనలో పాల్గొని పునీతులయ్యారు. హవనాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో సేవాసమితి అధ్యక్షులు శ్రీ అష్టకాల నరసింహరామశర్మగారు మాట్లాడుతూ శ్రీ స్వామివారి పవిత్ర స్మతికి నివాళులర్పించారు. ఆశ్రమంలో అన్ని హంగులూ కలిగిన భోజనశాల నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకతను వివరిస్తూ స్వీయ విరాళంగా ఇరవై ఐదువేల రూపాయలను ప్రకటిం చారు. ఆ వెంటనే శ్రీ మరుమాముల రాజ మౌళిశర్మ, శ్రీ భైరవభట్ల సీతారామశర్మ, శ్రీ మల్లోఝల రామగుండయ్య శర్మ స్పందించి పదకొండువేల రూపాయల చొప్పున తమ విరాళాలను ప్రకటించారు. సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ కాసుల లక్ష్మణమూర్తి గారు నివేదిక సమర్పించి శతజయంతి ఉత్సవాల నిర్వహణలో ఎదురైన అనుభవాలను వివరించారు.
శ్రీ స్వామివారు అవతరించి శత వసంతాలు పూర్తికావచ్చిన విశిష్ట ఘట్టాన్ని ఏడాదిపాటు నెలలో ఒక ప్రాంతంలో పాదుకా పూజతో నిర్వహించాలని సేవాసమితి నిర్ణయించడం శిష్య ప్రశిష్యు లకు చక్కని స్ఫూర్తిని అందించింది. ఈ మేరకు ఆశ్వయుజ మాసంలో తొలి పాదుకాపూజ సికింద్రాబాద్ నేరెడ్‌మెట్‌లో ఎం. రాజమౌళిశర్మ ఆధ్వర్యంలో 16 అక్టోబర్ 2005న జరిగింది. శత జయంతి ఉత్సవాలు కలిగించిన ప్రేరణలను పది కాలాల పాటు పదిలంగా దాచుకునే విధంగా ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక అధినేత శ్రీ ఎం.వి.ఆర్. శర్మ సభక్తిపూర్వకంగా శ్రీ స్వామి చిత్రంతో రూపొందించిన జ్ఞాపికలను వైదిక పండితులు, భక్తజను లకు బహూకరించారు. సార్వజనిక ఉత్సవాలు జరిగిన మూడు రోజుల్లో వర్థమాన సంగీత కళాకారులు ఎం. శశిధరశర్మ, అష్టకాల అనంతకృష్ణ శర్మల బృందం భక్తి సంగీత మాధుర్యాన్ని పంచి పెట్టారు. స్వామి శతజయంతి ఉత్సవాలు ప్రత్యక్షంగా, పరో క్షంగా పాలుపంచుకున్న వారందరికీ ధార్మికస్ఫూర్తిని అందించాయి.
– అష్టకాల రామ్మోహన్
శ్రీ సీతారామ విగ్రహప్రతిష్ఠ … షష్టిపూర్తి మహోత్సవం
పరమహంస పరివ్రాజకులు బ్రహ్మీభూత శ్రీశ్రీశ్రీ అఖండానంద సరస్వతీ స్వామివారు నెలకొల్పిన మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం, మాసాయిపేట శ్రీసీతారామాశ్రమంలోని శ్రీ సీతారామాలయం విగ్రహ ప్రతిష్ఠ జరిగి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా షష్టిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు .2017 ఏప్రిల్ 23వ ఆదివారం రోజున శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు, విద్వదాహితాగ్ని, జ్యోతిరప్తోర్యామయాజి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల వారి సమక్షంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యహవాచనం, మాతృక నాంది, అష్టోత్తర శతకలశ ఆవాహన పూజాదులు, శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులకు అష్టోత్తరశత పురుషసూక్త మహాకుంభాభిషేకం, అనంతరం తులసీదళాలతో అర్చన నిర్వహించారు . మధ్యాహ్నం 12 గంటల నుంచి గురుపాదుకాపూజ, భిక్షా నివేదనము, తీర్థ ప్రసాద వినయోగము, అన్నప్రసాద వితరణ, మహదాశీర్వచనము కొనసాగాయి. శ్రీ సరస్వతీ క్షేత్ర నిర్మాత బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహ రామశర్మ అష్టావధాని గారి ధార్మిక ప్రేరణతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు, పండితులు పాల్గొన్నారు.
–మరుమాముల వెంకటరమణ శర్మ