సనాతన ధర్మానికి పురాతన వైభవం- శ్రీగురుమాధవానంద సరస్వతీస్వామి
తీరిక లేకుండా సంచారం… అనుక్షణం ధర్మ ప్రచారం… కఠోర నిష్ఠగా జీవనం… యతిశ్రేష్ఠులుగా మార్గదర్శనం… ‘సర్వసంగ పరిత్యాగి’కి ప్రత్యక్ష నిదర్శనం… భక్తకోటి నీరాజనం…
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగంత్యక్త్వా కరోతియ ః
నిత్యతే న స పాపేన పద్మపత్ర మివాంభస ।।
అన్న గీతాచార్యుని వాక్యాన్ననుసరించి భగవదర్పణంగా, నిరాసక్తంగా కర్మలనాచరిస్తూ తామరాకుపై నీటిబిందువులాగా కర్మవాసనలేవీ అంటని
పరమహంస పరివ్రాజకాచార్యులుగా శ్రీ గురుమదనానంద సరస్వతీ
పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామి జీవన విధానమే
మనకు సందేశం.
యతిగా… పీఠాధిపతిగా… ధార్మిక యోగిగా… సనాతన ధర్మ పరిరక్షణకు
పన్నెండేళ్లుగా స్వామివారు అహరహం కృషి చేస్తున్నారు. సంసారంలో మనం
ఉండవచ్చు గానీ, మనలో సంసారం ఉండకూడదంటారు వారు. నిజమే!
నీళ్లలో పడవ ఉండవచ్చు కానీ, పడవలో నీళ్లు ఉండకూడదు కదా! వసుధైవ
కుటుంబకం అన్న భావనను ఆచరణాత్మకంగా లోకానికి చాటి చెబుతున్న
యతిశ్రేష్ఠులు స్వామివారు. ఒక పరమహంస పరివ్రాజకాచార్యులు ఎలా ఉండాలో
అన్న సనాతన వైదిక ధర్మానికి సజీవోదాహరణం వారు. నిరాడంబరమైన రూపం,
పూర్తి నిరాహారమైన జీవనం, నిర్వ్యాజకరుణామృతాన్ని కురిపించే వాత్సల్యం, మాధవానందుల వారి స్వభావం. ప్రతి ఒక్కరి జీవితానికీ పనికివచ్చే
ప్రత్యక్షోదాహరణలతో సాగుతుంది వారి అనుగ్రహభాషణం. ఎవరినైనా సరే
ఆత్మీయంగా పలకరించడం వారి నైజగుణం. రోజుకు వందలాది మైళ్ల దూరమైనా
సరే సంచారం చేసి, పిలిచిన వారు ఎవరైనా సరే, ఎంత దూరమైనా సరే, ఏమాత్రం
తీరిక దొరికినా వెళ్లి ఆశీరనుగ్రహాన్ని అందించడం వారు ఏర్పరచుకున్న నియమం.
నిర్మమత్వంతో, నిర్మోహంతో, ‘నడయాడే దైవం’గా, అలుపెరుగని
ప్రయాణాలతో ఆధ్యాత్మిక జ్ఞానప్రదాతగా స్వామివారి జీవితం అందరికీ
ఆదర్శప్రాయం. లెక్కకు మిక్కిలి యాగాలలో, దేవతా ప్రతిష్ఠాపనలలో, జీర్ణ
దేవాలయాల పునరుద్ధరణలలో స్వామివారు పాల్గొని సనాతన ధర్మానికి
పురాతన వైభవ కారకులవుతున్నారు.
నేటి తరం ‘నడయాడే దేవుడు’ శ్రీ మాధవానందసరస్వతీస్వామి
సదానంద పరంపరలో మదనానంద సరస్వతీ స్వామివారి వద్ద మంత్రోపదేశాన్ని పొంది, కోట్లాది జపానుష్ఠానాన్ని చేసి మంత్రసిద్ధులైన మహనీయులు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు. వీరు కృష్ణానంద సరస్వతీ స్వాముల పూర్వాశ్రమ పుత్రులు. శ్రీకృష్ణానందుల వారు మదనానందుల వారి వద్ద సన్యాసాశ్రమం తీసుకొన్నవారు. శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామివారి వద్ద తురీయాశ్రమాన్ని పొందినవారు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు. ఇలా మదనానందుల వారి ప్రత్యక్ష శిష్యులై కృష్ణానందుల వారి వద్ద సన్యాసాశ్రమ స్వీకృతులైన మాధవానందుల వారు- మదనానంద కరకమల సంజాతులైన కృష్ణానందుల కరకమల సంజాతులై గురు ద్వయాన్ని తమలో ఆవాహన చేసుకొని ప్రస్తుత మదనానంద సరస్వతీ పీఠాధిపతులై (సిద్ధిపేట జిల్లా తొగుట – రాంపురం) విరాజిల్లుతున్నారు.
పాత తరం వారు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారిని (పెరియార్) చూసి, వారి బోధనలు విని తరించారు. పెరియార్ను ‘నడిచే దైవం’గా భావిస్తారందరు. నిరాడంబరులై వినిర్మల జీవనులై జ్ఞాన వైరాగ్య సంపన్నులై ఆసేతు శీతాచల పర్యంతం కాలి నడకన పర్యటించి, ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధాలతో లక్షలాది మందిని అనుగ్రహించిన పెరియార్ను తమ కోసం కైలాసం నుండి కదలి వచ్చిన పరమశివునిగా భావిస్తారందరూ.
పెరియార్ను ప్రత్యక్షంగా చూడలేని ఈ తరం వారి కోసం కదలివచ్చిన మాధవానంద సరస్వతీ స్వామిని చూసిన వారందరూ ‘నడయాడే దేవుని’గా వీరిని భావిస్తున్నారు, కొలుస్తున్నారు. ప్రపంచానికే ఆదర్శమైన సనాతన హైందవ ధర్మ ప్రచార, ప్రతిష్ఠాపనలతో భారతీయులందరి జీవితాలలో ఆధ్యాత్మిక రోచిస్సులు నింపడమే లక్ష్యంగా నడిచారు. ఆనాడు పెరియార్, ఈనాడు మాధవానందులవారు. నిరాహారులై నిస్వార్థంగా, నిరాడంబరంగా తమ గురూత్తములు అనుసరించిన ధార్మిక మార్గంలోనే అనుగమిస్తూ సర్వసంగ పరిత్యాగులై దేశమంతటా పర్యటిస్తూ లక్షలాది మందికి జ్ఞానోపదేశాలనందిస్తూ, జిజ్ఞాసువుల ఆధ్యాత్మిక తృష్ణను తీరుస్తున్నారు. సద్గురు మాధవానందుల వారి జీవితాదర్శంపై దర్శనం అందిస్తున్న ఒక రేఖామాత్ర పరిచయమిది.
1966 విశ్వావసు నామ సంవత్సర మహాశివరాత్రి పర్వ దినాన ప్రభవించిన పార్నంది శ్రీరామశైలేశ్వర శర్మగారే తద నంతర కాలంలో తురీయాశ్రమ స్వీకారంతో మాధవానంద సరస్వతి అయ్యారు.
బ్రహ్మశ్రీ పార్నంది జానకీ రామశర్మ (వీరే కృష్ణానంద సరస్వతీ స్వామిగా మారారు) శ్రీమతి సరస్వతీ బాయమ్మల గర్భశుక్తి ముక్తాఫలమైన శ్రీరామశైలేశ్వర శర్మ తండ్రిగారు పనిచేస్తున్న పాఠశాలలోనే ప్రాథమిక, మాధ్యమికోన్నత విద్యలనభ్యసించి, ఉన్నత విద్యలను జగదేవపురం, సిద్ధిపేట్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో అభ్యసించారు.
జగదేవపురానికి చెందిన బ్రహ్మశ్రీ ఆదరాసుపల్లి చిదంబర శర్మ, భారతి దంపతుల కుమార్తె ల.సౌ. లలితతో శైలేశ్వర శర్మగారి పరిణయం జరిగింది. శైలేశ్వరుని ఆధ్యాత్మిక జీవనశైలికి అనుగుణమైన ధర్మపత్నిగా శ్రీమతి లలిత చిన్మయకలితగా ఎనలేని సేవలందించింది.
తెలుగు ఎం.ఎ.లో ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులై బ్రహ్మశ్రీ రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రిగారు రచించిన ‘తందనాన రామాయణం’పై పరిశోధన గావించి ఎం.ఫిల్ పట్టం పొందారు. కొంతకాలం జాతీయ మానసిక వికలాంగుల సంస్థలో ఉపన్యాసకునిగా పనిచేసి డిగ్రీ విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధించారు. వారిలో విద్యార్థి దశ నుంచే సహజ సిద్ధంగా ఉన్న ఆధ్యాత్మికత ఉత్తరోత్తరాభివృద్ధి చెందింది. కఠోర ఉపవాసాలతో, అర్చనలతో గంటలకొద్దీ ధ్యాన దీక్షలతో తపస్సులో మునిగిపోయేవారు.
తమ పదకొండవ యేటనే మదనానంద సరస్వతీ స్వామిని తొలిసారి దర్శించుకొన్నారు.
మహాత్ముల దర్శనంతోనే బీజప్రాయంగా ఉన్న జ్ఞాన వైరాగ్యాలు క్రమేపీ వృద్ధినొందాయి. 1979 స్వామివారికి అంతేవాసిగా మారి సేవలందించారు. 1987లో గుర్వనుగ్రహం లభించింది. మంత్రోపదేశమిచ్చి భవిష్యత్తులో సన్యాస యోగం లభిస్తుందని ఆశీర్వదించారు మదనానందుల వారు. ‘‘సమాజ స్వరూపంగా భగవంతుని సేవ’’ చేయమని సకల ప్రాణికోటిని ఆత్మస్వరూపంగా భావించమని ఉపదేశమిచ్చిన సద్గురువుల ఆశీస్సులే మాధవానందులకు పరమాదర్శాలైనాయి. వారి ప్రతి అడుగులో గురువుల ఆదేశమే ప్రతిఫలిస్తుంది.
ఎం.ఎ. చదువుతున్న సమయంలోనే భాగ్యనగర పర్యటనకు విచ్చేసిన జగద్గురువులు శ్రీ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు భారతీతీర్థ మహాస్వామి వారి దర్శనంతోనే శైలేశ్వరుల మనస్సులో తమ భావి జీవితాదర్శాలకు గమ్యం ఏమిటో దృగ్గోచరమైంది. ఆ వెంటనే సంపూర్ణ ఉత్తర దేశయాత్ర చేసి ఎందరెందరో సాధు సత్పురుషుల, యోగుల దర్శనాశీర్వచనాల నందుకొని వచ్చారు. సంస్కృతాంధ్రాంగ్ల భాషా భూషితులైన బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథ శర్మగారి వద్ద బ్రహ్మసూత్ర భాష్యాలు, ఉపనిషత్తులు, వేదాంత పంచదశి, భాగవత ప్రవచనాది విద్యలను అధ్యయనం చేశారు.
తమ తండ్రిగారు కృష్ణానంద యతీంత్రులైనందున శ్రీ మదనానంద సరస్వతీ పీఠ నిర్వహణ, ఆలయాల నిర్మాణాల బాధ్యతలతో పాటు పీఠానికి ధర్మాధికారిగా శైలేశ్వర శర్మ బహుముఖ ప్రతిభతో క్షణం తీరికలేని కార్యక్రమ వ్యగ్రులయ్యారు.
భాగ్యనగరంలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే 1989 ప్రాంతంలో వరుసగా 14 రోజుల పాటు ప్రతినిత్యం బసవకళ్యాణికి బస్సులో వెళ్ళి రాత్రంతా గురుదేవుల వద్ద వివిధ మంత్రోపదేశాలు, దేవతోపాసన అర్చనానుష్ఠానాలు, సన్యాసాశ్రమ నిర్వహణ విధి విధానాలు అధ్యయనం చేసివచ్చారు.
శ్రీ రామకృష్ణ పరమహంస జీవనయానంలో శారదాంబ పావనచరితగా ఎలా విలసిల్లిందో శైలేశ్వరుని జీవితంలో లలితమ్మ కూడా పరమ భావన జీవనగా తరించింది.
కొన్ని ఏళ్ళ పాటు నాటి వరంగల్ జిల్లా చేర్యాల సమీపంలోని చుంచనకోటలో వెలసిన భువనేశ్వరీ మాతృసేవను ప్రతి శుక్ర వారం నిర్వహించి వచ్చేవారు. సిద్ధసంకల్పులు శతావధాని బ్రహ్మశ్రీ విఠాల చంద్రమౌళి శాస్త్రిగారు ప్రతిష్ఠించిన భువనేశ్వరీ మాతృసేవలతో తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు.
అంతేకాకుండా ధర్మాధికారిగా సద్గురు మదనానంద సరస్వతీ పీఠానికి ఎనలేని సేవలందించడమే కాకుండా కృష్ణానందుల వారు వివిధ ప్రాంతాలలో స్థాపించిన ఆశ్రమాలను, భజన సంఘాలను పటిష్ఠపరుస్తూ భక్తుల సహకారంతో వైద్య శిబిరాలు, ఆధ్యాత్మిక గోష్ఠులతో బాటు ‘ఆనంద సాధనమ్’ అనే పేరుతో పీఠం నుండి వెలువడే ఆధ్యాత్మిక మాసపత్రికకు సంపాదక మార్గదర్శకత్వం వహించారు. భుజరంపేట జోగిపేటల మధ్య రహదారిని బాగు చేయడం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలకు ప్రేరణనిచ్చి నిర్వహించారు.
2005లో శ్రీకృష్ణానందుల వారి ఉత్తరాధికారిగా మాధవా నందులవారు పీఠాధిపత్యం స్వీకరించడంతో గురువుల పరమగురువుల ఉపదేశాలతో కర్తవ్యోన్ముఖులైనారు. ‘దినైక రాత్రం…’ అన్నట్లుగా ఒక రాత్రికంటే ఎక్కువ ఎక్కడా ఉండ కుండా నిరంతర ధర్మ ప్రచారాలతో అహరహం అవిశ్రాంతంగా సంచరిస్తున్నారు. ఒక్క చాతుర్మాస్యదీక్షల సమయంలో తప్ప తమ పీఠంలోను నిలకడగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ.
సమాజమే భగవత్స్వరూపంగా ఆధ్యాత్మిక ప్రబోధమే భగవదర్చనగా స్వామివారి సంచారం కొనసాగుతుంది. పిలిచిన వారు పేదవారైనా, ఆగర్భ శ్రీమంతులైనా సరే, ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా సరే ఎంతదూరమైనా వెళ్ళి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు స్వామివారు.
దేహమంతటా విభూతి రేఖలతో ఫాలభాగంలో త్రినేత్రంలా భాసిల్లే కుంకుమ బొట్టుతో, రుద్రాక్షమాలాధారణతో, కేవల కౌపీనంతో ఒంటిపై జనపనారతో తయారైన ఒక వస్త్రాన్ని మాత్రమే నడుముకు చుట్టుకొని అర్ధ దిగంబరులై అపర (ఆది) శంకరుల వలె దర్శనమిస్తారు భక్తులందరికీ.
ఆశ్రమ స్వీకారం నాటికే గురుదేవులు కృష్ణానందులు తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. పూర్వాశ్రమంలో తండ్రిగా తురీయా శ్రమంలో గురువుగా ఉన్న శ్రీవారికి చేసిన సేవ నాన్యతో దర్శనీయం. గురుపద సేవలో అటు కృష్ణానందులు, ఇటు మాధవానందులు సమా జానికి ఆదర్శంగా నిలుస్తారు.
పీఠాధిపతులుగా మాధవా నందులు నిరంతర సంచారాలు చేస్తూనే ఎన్నెన్ని అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో స్థాలీపులాక న్యాయంగా పరిశీలిస్తే…
2009లో వందలాది మంది భక్తులతో కలిసి పరమ గురుస్థానమైన బసవకళ్యాణికి పాదయాత్ర నిర్వహించారు. దారి పొడుగునా నీరాజనాలతో, ఆధ్యాత్మిక భక్తిభావంతో సాగిన ఈ యాత్ర ఆదిశంకరుల విజయయాత్రను తలపించింది. 2010లో పీఠంలో అతిరుద్రయాగాన్ని నిర్వహించడమే కాకుండా వర్గల్ శ్రీవిద్యా సరస్వతీ మాతృ సన్నిధికి పాదయాత్ర చేశారు.
2011లో కుబేర పాశుపత యాగాన్ని పీఠంలో అనితర సాధ్యంగా నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరమే (2012లో) కోటి రుద్రాక్షలతో శ్రీ మాతృ జప మహాయాగాన్ని నిర్వహించారు.
2013లో శ్రౌతేష్టి, చాతుర్మాస్యేష్టిలను సవైదికంగా పీఠంలో నిర్వహించారు.
2014లో ‘విష్ణవే నమః’ మంత్రాన్ని వేయి కోట్లు జపింపజేసి భక్తులతో శిష్యులతో తిరుమలకు చేరుకొని శ్రీ వేంకటేశ్వరుని దివ్య సన్నిధానంలో 11 రోజుల పాటు ‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిగా అఖండ భజన, జప మహాయజ్ఞాన్ని నిర్వహించారు.
2015లో తమకు అంతేవాసులైన భాస్కరశర్మ గారికి సన్యాసదీక్షనిచ్చి ‘మధుసూదనానంద సరస్వతీ’ యోగపట్టాన్నిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో బాటుగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో గణపతి, శతచండి, సహస్రచండి, రుద్ర యాగాదులను అసంఖ్యాకంగా నిర్వహించారు.
1500 మంది శిష్య ప్రశిష్య బృందంతో కాశీ పట్టణంలో ‘శివాభ్యాం నమః’ అనే నామాన్ని వెయ్యి కోట్ల జపానుష్ఠానాలతో మహాయజ్ఞాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కె. చంద్రశేఖరరావుగారి ఆహ్వానం మేరకు అయుత చండీ యాగానికి వెళ్లి, ఆచార్యస్థానమలంకరించారు.
గోదావరీ, కృష్ణా పుష్కరోత్సవాలలో శిష్య సమేతంగా పాల్గొని తీర్థ స్నానాలాచరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజోపయోగార్థం నిర్మించ తలపెట్టిన మల్లన్నసాగర్కు ఆటంకం కలగకుండా తొగుట రాంపురంలో తమ ఆశ్రమ ప్రాంగణాన్ని స్వచ్ఛందంగా వదిలి మంజీరా నదీతీరానికి కదిలి రంగంపేట పైతర గ్రామ శివారులకు తమ పీఠాన్ని తరలించారు.
డిసెంబర్ 14, 2016న గురుపూజతో ఫిబ్రవరి 6, 2016న శంకుస్థాపనలతో శరవేగంగా పరమ రమణీయంగా నూతన ఆశ్రమ నిర్మాణం కొనసాగుతుంది. ఈ నూతన పీఠ ప్రాంగణంలోనే స్వామివారు చాతుర్మాస్యదీక్షను నిర్వహించారు.
‘గ్రామభిక్ష’ కార్యక్రమం క్రింద ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతానికి వెళ్లడం- ఒక్కోరోజు పది గ్రామాలను సైతం అలుపెరగకుండా సందర్శించడం స్వామివారి నిత్యకృత్యం.
ఇప్పటివరకు 1200 గ్రామా లకు పైగా తిరిగి భిక్ష స్వీక రించారు. (ఇది ఉజ్జాయింపు లెక్క మాత్రమే – ఒక్కో గ్రామానికి ఎన్నిసార్లు వెళ్లినా ఒకసారి మాత్రమే లెక్కించడ మైనది.)
గురువుల, పరమ గురువుల మార్గంలోనే కాకతీయుల కాలం నాటి అతి ప్రాచీనమైన కొండపాక రుద్రేశ్వరాలయం వంటి ఎన్నో జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలు గావించడం, మరెన్నో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళి అనుగ్రహ భాషణమివ్వడం అవిరామంగా కొనసాగుతోంది.
ఎక్కడకు వెళ్లినా ఆలయాలలోనో ధర్మసత్రాలలోనో ఉంటారే తప్ప- ఏ గృహస్థుని ఇంటిలోకి ప్రవేశించకపోవడం వీరు ఏర్పరచుకున్న కఠోర నియమం. వీరిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి ప్రసాద రూపంలో పిడికెడు మురమరాలను అందించడం ఈ పీఠంలో పరంపరాగతంగా వస్తున్న ఆచారం. సదానంద సంప్రదాయంలో అహంకార రాహిత్యానికి, సభ్యసౌహిత్యానికీ ప్రతీకగా పురుషులు విధిగా అంగీ బనియన్ వదిలి, స్త్రీలు నిండుగా కొంగు కప్పుకొని ప్రసాదాన్ని నామస్మరణ పూర్వకంగా అందుకోవాలి.
ఎవరైనా సరే ఆర్తితో జిజ్ఞాసతో అడిగే ప్రతి ప్రశ్నకు స్వామివారు తక్షణ పరిష్కారం అందిస్తారు. ప్రతి భక్తుడు స్వామి సమాధానాలతో సంతుష్టాంతరంగులౌతాడు. అసమాన వైదుష్యంతో ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అన్న తమ గురువర్యుల ఉపదేశాన్ని ఆచరణాత్మక ప్రబోధంగా అందిస్తున్న మాధవానంద స్వామివారు 22 మార్లు భాగవత ప్రవచనం గావించారు.
ఆనంద రామాయణం, దేవీ భాగవతం, ఉపనిషత్తు లను ప్రవచిస్తూ అసంఖ్యాక అనుగ్రహభాషణలందించారు.
స్వామివారి భిక్షా పాత్ర నుండి ఎందరో బీద విద్యార్థులకు, జీర్ణదేవాలయోద్ధరణలకు సాయమందించి దివ్యాశీఃప్రదాత లైనారు. నిరతాన్నదానాన్ని పీఠం పక్షాన నిరంతరాయంగా అందిస్తున్నారు. సమాజ సేవలలో స్వచ్ఛంద కార్యక్రమాలతో నిరుపమానమైన సేవలందిస్తున్నారు స్వామివారు. ఇక్కడి సాంగ వేద పాఠశాలలో ఉచిత ఆవాస సదుపాయాలతో ఎంతోమంది పేద విద్యార్థులు వేదవిద్యనభ్యసిస్తున్నారు.
సకల దేవతా స్వరూపమైన గోశాల నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా తప్పనిసరిగా ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి ఎంతోమందికి ఆరోగ్యప్రదాతలౌతున్నారు.
మదనానంద సరస్వతీ పీఠం పక్షాన వివిధ రంగాలలో నిష్ణాతులైన కవి పండితులను, ఆధ్యాత్మిక సామాజిక సేవా తత్పరులకు ప్రశంసాపూర్వక సత్కారాలనందిస్తున్నారు.
బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథ శర్మగారు ప్రధాన సంపాదకు లుగా 12 మంది సంస్కృతాంధ్ర విద్వాంసులతో శ్రీమద్భాగవత మహాపురాణ సంహితను శ్రీధరీయ వ్యాఖ్యానానికి ఆంధ్రాను వాదంతో 12 సంపుటాలుగా ముద్రించారు. అదేవిధంగా గురుస్తుతిని, భాగవత చూర్ణికను (తెలుగు అనువాదంతో) ముద్రించారు.
కదిలే విజ్ఞాన భాండాగారంగా, నడుస్తున్న శివునిగా చరిస్తూ సమాజమే భగవత్స్వరూపంగా సందేశాలనందిస్తూ తరింపజేస్తున్న శ్రీ మాధవానంద యతీంద్రులు 12వ పీఠాధిపతులుగా గత పుష్కరకాలంగా పుష్కల సేవలందిస్తున్నందుకు గుర్తుగా ఈ వ్యాసం వారికొక అక్షర నీరాజనం.
—మరుమాముల దత్తాత్రేయశర్మ
శ్రీ మదనానంద యతీంద్రుల ఆశీస్సులే ఊపిరిగా…
కర్ణాటక రాష్ట్రంలోని బసవకళ్యాణ్ పట్ట ణంలో వెలసిన సనాతన సదానంద ఆశ్రమంలో పీఠాధిపతులుగా విరాజిల్లారు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీమదనానంద సరస్వతీ స్వామివారు. మెదక్ జిల్లా టేక్మాల్ ప్రాంతంలో జన్మించిన శ్రీ స్వామివారు ఆజన్మ బ్రహ్మచర్యంతో సర్వసంగ పరిత్యాగులై అకుంఠిత జపతపో యజ్ఞాలను నిర్వహించి దైవప్రేరణతో కర్ణాటకలోని బసవ కళ్యాణ్కి చేరారు. అక్కడి పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద యతివరు లకు అనుంగు శిష్యులైనారు. వారి ఆజ్ఞ మేరకు చేర్యాల, సిద్ధిపేట, తొగుట తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరించి వందలాది మందికి ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను అందించి నిరతాన్నదానవ్రతులుగా కోటిలింగాల ఆలయాల ప్రతిష్ఠాప కులుగా నిలిచారు. అంత్య సమయంలో గురుశుశ్రూషకై తిరిగి బసవకళ్యాణ్కి చేరి అక్కడే గురువుగారి ఆజ్ఞ మేరకు తదనంతర పీఠాధిపతులుగా నిలిచిపోయారు. అపరశివావతారులైన శ్రీ మదనానంద సరస్వతీ స్వామివారికి అంతేవాసులుగా ప్రియతమ అనుచరులుగా మెలిగి తురీయాశ్రమాన్ని స్వీకరించారు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామివారు. వారే గురువాజ్ఞను శిరసావహించి రాంపురంలోని శ్రీ గురుమదనానంద సరస్వతీపీఠాన్ని నెలకొల్పి గురువుల మార్గంలోనే త్యాగమయ నిరాడంబర జీవితాన్ని గడుపుతూ నిరతాన్నదాన వ్రతాన్ని కొనసాగిస్తూ ఆదర్శ తపోమూర్తిగా విరాజిల్లుతున్నారు. పీఠంలో శ్రీ గురుమదనానంద సరస్వతీ స్వామివారి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆశ్రమ వ్యవస్థాపకులు, పీఠాధిపతులు శ్రీ కృష్ణానంద సరస్వతీస్వామివారే అయినప్పటికీ నిర్వహణ బాధ్యతను సమస్తాన్నీ తన భుజస్కంధాలపై ధరించి పీఠాన్ని దివ్య ఆధ్యాత్మిక కేంద్రంగా ఇతోధి కంగా అభివృద్ధిపరిచారు శ్రీరామశైలేశ్వరశర్మ గారు (ధర్మాధికారి), వారి సోదర ద్వయం.
నిరంతర వైరాగ్య మార్గంలో శ్రీకృష్ణానందుల వారి పూర్వా శ్రమ పుత్రులైన శైలేశ్వరశర్మగారు భగవద్భక్తి పరాయణులైన ఆదర్శజీవనులు. శ్రీ మదనానంద యతీంద్రుల దివ్యదర్శ నంతో వారిలో బీజప్రాయంగా ఉన్న భక్తి వైరాగ్యాలు వికసింప సాగాయి. గురుమదనానందుల వద్ద మంత్రదీక్షను పొంది కఠోర సాధనలతో తమ ఆధ్యాత్మిక మార్గాన్ని సుస్థిరపరచు కున్నారు. గురువులకే ఆశ్చర్యానందాలను కలిగించే సాధన వారికలవడింది. దానికితోడు సన్యస్తులై పీఠాధిపతులుగా విరా జిల్లుతున్న శ్రీ కృష్ణానందస్వాముల యోగ సాధనలను ప్రత్యక్షంగా గమనించడం, వారి సేవల లోనే సమయాన్ని వెచ్చిస్తూ పీఠాభివృద్ధికి నిరంతరాయంగా పాటుపడడం శైలేశ్వర శర్మగారి నిర్ణిద్ర కృషీవలత్వానికి నిదర్శనం.
శ్రీ స్వామివారి ముందు మూడేళ్ల క్రితమే తమలోని తీవ్ర వైరాగ్య భావనలను వ్యక్తీకరించారు శైలేశ్వరశర్మ. సమయం వచ్చేదాకా ఆగమని, అందాక సాధనను ఆపవద్దని సూచించారు స్వామివారు.
పీఠంలో మూడేళ్ల క్రితం జరిగిన శతకోటి గాయత్రీ మహాయజ్ఞం అనంతరం శైలేశ్వరశర్మ తన జీవన విధానాన్ని పూర్తిగా వాన ప్రస్థాశ్రమ పద్ధతిలోకి మార్చుకున్నారు. వారి ధర్మపత్ని శ్రీమతి లలిత సహధర్మచారిణిగా భర్తృసేవలలోనే గడుపుతూ గురు వృద్ధులను, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఆదర్శమూర్తిగా ప్రశంసనీయ పద్ధతిలో విరక్త జీవనాన్ని గడుపుతున్నారు. వారి ఏకైక కుమారుడు కూడా వైదిక మార్గంలో విద్యాభ్యాసం నిర్వహిస్తుండడం విశేషం.
శ్రీశ్రీ మాధవానందాష్టకమ్
(మాలినీ వృత్తే)
(దర్శనమ్ నవంబరు -2017 సంచిక నుంచి )
శ్రితజన పరిపాలం చిన్మయోద్భాసి ఫాలం
లలిత మహిమజాలం లలితానందహేలం
ప్రణవ మను విలోలం ప్రాంచితాధ్యాత్మ లీలం
మమ మనసి భజే శ్రీ మాధవానంద హంసం 1
సురభిళ సుమ వాచా తత్త్వ మావేదయంతం
మధుర మధుర భావైః సత్త్వ మాపూరయంతం
కలిత మృదుల దృష్ట్యా సత్యమాదర్శయంతం
మమ మనసి భజే శ్రీ మాధవానంద హంసం 2
పరశివ గురు రూపం ప్రజ్వలానంద దీపం
వ్యపగత భవతాపం బ్రహ్మ విద్యా ప్రతాపం
హృత నత జన పాపం దీప్త భస్మానులేపం
మమ మనసి భజే శ్రీ మాధవానంద హంసం 3
శమ దమ సహితం శ్రీ భాగవత్యుక్త్యఖండం
కరధృత వర దండం జ్ఞాన విజ్ఞాన భాండం
నిజపద నమితౄణాం పారిజాత ప్రకాండం
మమ మనసి భజే శ్రీ మాధవానంద హంసం 4
నియమ సహిత వేషం నిత్య కాషాయ భూషం
నిగమ నిశిత భాషం నిర్గతాత్మారి దోషం
స్ఫటిక మణిరివైవం శుద్ధభాస్వన్మనీషం
మమ మనసి భజే శ్రీ మాధవానంద హంసం 5
నిజగళ పరిరాజ ద్భద్ర రుద్రాక్ష హారం
జలధిరివ గభీరం మేరుశైలాగ్ర ధీరం
సకల హితముదారం సర్వ సంకల్ప దూరం
మమ మనసి భజే శ్రీ మాధవానంద హంసం 6
శ్రుతి సుమ సముదర్కం శిష్య హృత్తామసార్కం
సమమతి కృతి దక్షం సంహితాద్వైత దీక్షం
దురిత వన దవాగ్నిం ద్యోత ధర్మానురక్షం
మమ మనసి భజే శ్రీ మాధవానంద హంసం 7
జ్వలిత శుభ తరంగం శుభ్ర విద్యాంతరంగం
యతివర మదనానందాంఘ్రి మందార భృంగం
మహిమ మహిత కృష్ణానంద హస్తాబ్జ జాతం
మమ మనసి భజే శ్రీ మాధవానంద హంసం 8
–శతావధాని పంచాననః డా. జి.ఎం. రామశర్మా